UPI: రూ.2000 దాటితే బాదేస్తారా? యూపీఐ రూల్స్ గురించి అసలు నిజాలు ఇవే!
అసలు నిజాలు ఇవే!
UPI: కోట్లాది భారతీయులకు డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, యూపీఐ పిన్ ఎంటర్ చేయడం క్షణాల్లో పనులు అయిపోతుంటాయి. అయితే, ఇటీవల కాలంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు పడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో యూపీఐ పేమెంట్స్ చేస్తే సామాన్యుల జేబులకు చిల్లు పడుతుందా? అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. అసలు ఈ రూ.2,000 నిబంధన వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రభుత్వం అసలు ఏం చెప్పింది?
ఫైనాన్స్ మినిస్ట్రీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలు, రూపే డెబిట్ కార్డ్ పేమెంట్లపై బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు వసూలు చేయడానికి వీలేదు. అంటే మీరు రూ.2,000 వరకు ఎంత మందికి ఎంతసారైనా ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా డబ్బులు పంపుకోవచ్చు. ఈ నిబంధన వినియోగదారులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది.
రూ.2000 దాటిన లావాదేవీల పరిస్థితి ఏమిటి?
చాలా మంది రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో యూపీఐ పేమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఛార్జీలు పడతాయని అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నేరుగా వినియోగదారులపై ఎలాంటి కన్స్యూమర్ ట్రాన్సాక్షన్ ఫీజును ప్రకటించలేదు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలో చేసిన మార్పులు భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక సందర్భాల కోసం ఒక చట్టపరమైన రూపురేఖలను మాత్రమే సిద్ధం చేశాయి.
96 శాతం మందికి ఎలాంటి ప్రభావం ఉండదు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో జరుగుతున్న మొత్తం పీ2ఎం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం లావాదేవీలు రూ.2,000 లోపు ఉండేవే. కేవలం 4 శాతం లావాదేవీలు మాత్రమే రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. కాబట్టి సామాన్య ప్రజలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఒకవేళ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిబంధనలు వచ్చినా, అవి కేవలం భారీ లావాదేవీలు స్వీకరించే పెద్ద వ్యాపారులకు వర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు మొత్తం కట్ కాదు.
ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపుల వైపు అడుగులు
మరోవైపు డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేసేందుకు ట్యాప్ అండ్ పే వంటి ఆఫ్‌లైన్ యూపీఐ విధానాలపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇంటర్నెట్ సరిగా లేని గ్రామీణ ప్రాంతాలు లేదా టైర్-2, టైర్-3 నగరాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా డిజిటల్ చెల్లింపులు ఆగిపోకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే, సామాన్యులకు యూపీఐ సేవలు ఎప్పుడూ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.