Fastag: హైవేలపై టోల్ కష్టాలకు చెక్..మార్చి 2027 నాటికి 100 శాతం బేరియర్-ఫ్రీ ప్రయాణం
బేరియర్-ఫ్రీ ప్రయాణం
Fastag: సుదూర ప్రయాణాలు చేసే వారికి టోల్ గేట్ల వద్ద నిలబడటం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. గంటల తరబడి వాహనాలు బారుల తీరడం వల్ల సమయంతో పాటు ఇంధనం కూడా వృథా అవుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానాన్ని పూర్తిగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అందించిన సమాచారం ప్రకారం.. రాబోయే కాలంలో హైవేలపై టోల్ ప్లాజాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని నేషనల్ హైవే టోల్ బూత్‌లను పూర్తిగా బేరియర్-ఫ్రీగా మార్చనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 90 శాతానికి పైగా టోల్ ప్లాజాలు ఈ విధానంలోకి మారనున్నాయి. ప్రస్తుతం దేశంలో కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు అందుబాటులో ఉండగా, హైవేలపై వీటి వాడకం 98 శాతానికి పైగా చేరింది.
ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ
కొత్త విధానంలో భాగంగా మల్టీ-లేన్ ఫ్రీ-ఫ్లో టోలింగ్ సిస్టమ్‌ను తీసుకువస్తున్నారు. దీనికోసం ఏఎన్‌పీఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వాహనాలు టోల్ జోన్ దాటే సమయంలో అక్కడ అమర్చిన అతధునిక కెమెరాలు వాహన నెంబర్ ప్లేట్‌ను ఇట్టే స్కాన్ చేస్తాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా, బేరియర్లు తెరుచుకునే వరకు ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా లింక్ చేసిన ఖాతా నుంచి టోల్ అమౌంట్ కట్ అవుతుంది. ముంబైలో ఈ విధానాన్ని ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు.
ఇంధనంతో పాటు విలువైన సమయం ఆదా
ఈ కొత్త మార్పుల వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. ఇంతకుముందు టోల్ ప్లాజా వద్ద ఒక్కో వాహనం సగటున 12 నిమిషాల పాటు నిలబడాల్సి వచ్చేది. కొత్త సిస్టమ్ అమల్లోకి వస్తే ఈ నిరీక్షణ సమయం పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల ప్రజల విలువైన సమయం ఆదా కావడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ సమస్య తప్పుతుంది. వేలాది కోట్ల రూపాయల విలువైన ఇంధనం వృథా కాకుండా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం
ఈ సాంకేతికత కేవలం ప్రజలకే కాకుండా ప్రభుత్వానికి కూడా ఎంతో లాభదాయకంగా మారుతోంది. ఫాస్టాగ్‌ల వాడకం వల్ల ఇప్పటికే టోల్ కలెక్షన్ భారీగా పెరిగింది. ఈ కొత్త ఆటోమేటిక్ విధానం పూర్తిగా అమలైతే ప్రభుత్వానికి ఏటా వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. టోల్ నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గిపోతాయి.