Scam Alert : తస్మాత్ జాగ్రత్త.. పీఎం మోదీ పేరుతో భారీ స్కాం.. రోజుకు రూ.1.25లక్షల లాభం అంతా అబద్ధమే
రోజుకు రూ.1.25లక్షల లాభం అంతా అబద్ధమే;
Scam Alert : సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పెట్టుబడి పథకాన్ని ప్రచారం చేస్తున్నారని, కేవలం రూ.21,000 పెట్టుబడితో ప్రతిరోజూ రూ.1.25 లక్షల లాభం పొందవచ్చని చెబుతున్నారు. వినడానికి ఇది ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నా దీనిని ఫాలో అయ్యారంటే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియోను AI, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించారని చెప్పి అసలు నిజాన్ని వెలుగులోకి వచ్చింది. పీఎం మోదీకి గానీ, భారత ప్రభుత్వానికి గానీ ఇలాంటి పథకాలతో లేదా ప్లాట్‌ఫామ్‌లతో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తమ సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది.. "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పీఎం మోదీ రూ.1.25 లక్షల రోజువారీ లాభం ఇచ్చే పెట్టుబడి పథకం గురించి మాట్లాడుతున్నారని చెప్పడం పూర్తిగా అబద్ధం. ఈ వీడియోను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారు." ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దు, ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి బాగా పరిశోధించి తెలుసుకోవాలని PIB ప్రజలను కోరింది.
ఈ రోజుల్లో AI, డీప్‌ఫేక్ టెక్నాలజీలను తప్పుడు పనులకు ఉపయోగించడం పెరిగిపోతోంది. మోసగాళ్లు ఈ టెక్నాలజీలను ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నాయకుల, ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగించి, ఈ మోసగాళ్లు ప్రజలను సులభంగా తమ ఉచ్చులోకి లాగుతున్నారు. కాబట్టి, ఏదైనా పెట్టుబడి పథకంలో డబ్బు పెట్టే ముందు దాని విశ్వసనీయతను తనిఖీ చేయడం చాలా ముఖ్యమని PIB సలహా ఇచ్చింది.