Chinese Smartphone Brands : చైనా ఫోన్లకు చెక్.. భారత్‌లో తొలిసారిగా పడిపోయిన షావోమీ, ఒప్పో అమ్మకాలు
భారత్‌లో తొలిసారిగా పడిపోయిన షావోమీ, ఒప్పో అమ్మకాలు
Chinese Smartphone Brands : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏళ్ల తరబడి రాజ్యమేలిన చైనా కంపెనీల హవాకు బ్రేకులు పడ్డాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో షావోమీ, ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి అగ్రగామి బ్రాండ్లు భారత్‌లో తొలిసారిగా తమ అమ్మకాల్లో తిరోగమనాన్ని చవిచూశాయి. రెగ్యులేటరీ ఫైలింగ్ డేటా ప్రకారం.. భారత్‌లో పనిచేస్తున్న టాప్-9 చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీల మొత్తం ఆదాయం 4.5% మేర తగ్గింది. అంతకుముందు ఏడాది ఏకంగా 42% వృద్ధిని సాధించిన ఈ కంపెనీలు, ఇప్పుడు నష్టాల బాట పట్టడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాధారణంగా భారతీయులు బడ్జెట్ ఫోన్లకే మొగ్గు చూపుతారని పేరు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రూ.20,000 లోపు ధర ఉన్న ఫోన్ల మార్కెట్ వాటా రెండేళ్ల క్రితం 38% ఉండగా, ఇప్పుడు అది 29% కి పడిపోయింది. చైనా బ్రాండ్లు ఎక్కువగా ఈ బడ్జెట్ విభాగంపైనే ఆధారపడటంతో వాటికి గట్టి దెబ్బ తగిలింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. విక్రయించే ఫోన్ల సంఖ్యలో చైనా బ్రాండ్లు 75% వాటాను కలిగి ఉన్నా, విలువ పరంగా మాత్రం వాటి వాటా 54% నుంచి 48% కి పడిపోయింది. అంటే ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నా, వాటి ద్వారా వచ్చే లాభం మాత్రం గణనీయంగా తగ్గుతోంది.
భారతీయ కస్టమర్లు ఇప్పుడు ప్రీమియం ఫోన్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పును యాపిల్, శాంసంగ్ కంపెనీలు సరిగ్గా అందిపుచ్చుకున్నాయి. ఐఫోన్ల అమ్మకాలు 18% పెరిగి రూ. 79,378 కోట్లకు చేరుకోగా, శాంసంగ్ 12% వద్ధితో రూ. 1.11 లక్షల కోట్ల మార్క్ దాటి రికార్డు సృష్టించింది. చైనా కంపెనీల గూటికి కన్నం వేస్తూ ఈ రెండు కంపెనీలు మార్కెట్ విలువను తమ ఖాతాలోకి మళ్లించుకున్నాయి. అయితే, చైనా కంపెనీలలో కేవలం వీవో మాత్రమే ప్రీమియం మోడల్స్‌తో గట్టి పోటీ ఇస్తూ 11% ఆదాయ వృద్ధిని నమోదు చేయడం విశేషం.
స్మార్ట్‌ఫోన్ రంగంలో చైనా బ్రాండ్లు చతికిలపడినా, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల విభాగంలో మాత్రం హయ్యర్ (Haier), లెనోవో వంటి కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. మెమరీ చిప్స్ ధరలు పెరగడం వల్ల ఫోన్ల రేట్లు కూడా భారమవుతున్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్లో స్ట్రాంగ్‌గా ఉన్న బ్రాండ్లు మాత్రమే ఇప్పుడు నిలదొక్కుకుంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే, రాబోయే రోజుల్లో చైనా కంపెనీలు భారత్‌లో మనుగడ సాగించాలంటే కేవలం చౌక ఫోన్ల మీద కాకుండా, నాణ్యమైన ప్రీమియం ఫోన్ల మీద దృష్టి పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.