Visakhapatnam : విశాఖలో జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం

10వేల ఉద్యోగాలు కల్పించేలా ANSR సంస్థతో ఎంఓయు;

Update: 2025-07-08 09:55 GMT
  • జిసిసి, ఐటి రంగాల్లో 5లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం
  • ఏడాదిలోనే గ్లోబల్ ప్లేయర్ లను ఆకర్షించడం మా తొలి విజయం
  • ఎఎన్ఎస్ఆర్ ఎంఓయు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్

గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థ విశాఖపట్నంలో జీసీసీల కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థ మధురవాడ ఐటి క్లస్టర్‌లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ క్యాంపస్ ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో 10వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యుత్తమ ప్రతిభ గల పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో ప్రపంచస్థాయి సంస్థలకు ఏఎన్‌ఎస్‌ఆర్‌ మద్దతునిస్తుంది. ఈ సందర్భంగా ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థ సిఇఓ లలిత్ అహూజా మాట్లాడుతూ ప్రపంచస్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ లీడర్ షిప్ మేలు కలయికగా ఉన్న విశాఖ మహానగరం అద్భుతాలను సృష్టిస్తుందన్నారు. విశాఖలో తాము ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలకు గమ్యస్థానంగా మారబోతోందని ఆయన చెప్పారు.

విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో ఎపిలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యమని ప్రకటించారు. ఇందులో ఐటి, జిసిసి రంగాల్లోనే 5లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. ఇందుకోసం విశాఖ మహానగరం నుంచే మా ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. బెంగుళూరు, గోవా నగరాల మేలు కలయిక విశాఖ నగరమని చెప్పారు. వ్యాపారానికి అనుకూలమైన నగరంగానే గాక ప్రతిభను ఆకర్షించే ప్రాంతంగా విశాఖను తయారుచేయాలన్నది మా విధానమని నారా లోకేష్‌ పేర్కొన్నారు. . ఇందులో భాగంగా టిసిఎస్, కాగ్నిజెంట్ లకు ఎకరా 99 పైసలకే భూములను కేటాయించామన్నారు. భారత్ లోని టాప్ – 100 ఐటి కంపెనీలను ఎపికి రప్పించాలన్నదే మా లక్ష్యం అని చెప్పారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అన్నింటినీ విశాఖ నగరంలో కల్పిస్తున్నామని ఐటీ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. విశాఖలో నూతనాధ్యాయం కోసం మేం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఐటి శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News