Sunil Bharti : 7 రోజుల్లో 90 వేల కోట్లు.. ఎయిర్‌టెల్ షేర్ల స్పీడ్ మామూలుగా లేదు!

ఎయిర్‌టెల్ షేర్ల స్పీడ్ మామూలుగా లేదు!

Update: 2025-11-19 06:51 GMT

Sunil Bharti : సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ దేశంలోనే టాప్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో గత కొద్ది రోజులుగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. మంగళవారం కూడా వరుసగా ఏడో రోజు ఎయిర్‌టెల్ షేర్ల ధర పెరిగింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈ షేర్లు దూసుకుపోతున్నాయి. దీనితో షేరు ధర 52 వారాల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది.

ఎయిర్‌టెల్ షేర్లు పెరగడం వల్ల కంపెనీ మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. వరుసగా 7 రోజుల్లో ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్‌లో ఏకంగా రూ.90,036 కోట్లు పెరిగింది. అక్టోబర్ 7న కంపెనీ విలువ రూ.11,41,048 కోట్లుగా ఉండగా, తాజాగా ఇది రూ.12,31,084 కోట్లకు చేరింది. సాధారణంగా స్టాక్ మార్కెట్ కాస్త నెమ్మదిగా ఉన్నా లేదా నష్టాల్లో ఉన్నా, ఎయిర్‌టెల్ షేర్లు మాత్రం ర్యాలీ చేశాయి.

మంగళవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ ధర 2 శాతం పెరిగి రూ.2,153.05 వద్ద ట్రేడ్ అయింది. ట్రేడింగ్ సమయంలో ఇది రూ.2,159 దగ్గర 52 వారాల గరిష్టాన్ని తాకింది. అంతకుముందు రోజు ఈ షేర్ రూ.2,112.20 వద్ద ముగిసింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం.. గత 7 ట్రేడింగ్ రోజుల్లో ఎయిర్‌టెల్ షేర్ ధర దాదాపు 8 శాతం పెరిగింది. అక్టోబర్ 7న రూ.2,001.10 వద్ద ఉన్న షేర్ ఇప్పుడు దాదాపు రూ.157 మేర పెరిగింది.

ఎయిర్‌టెల్ షేర్లు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.. కంపెనీ మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడం వల్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ S&P గ్లోబల్ ఎయిర్‌టెల్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచింది. ఇది కంపెనీ ఆర్థిక స్థితి బలంగా ఉందని సూచిస్తుంది. టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ దూకుడు, 5G రోల్‌అవుట్ వంటి కారణాల వల్ల రాబోయే రోజుల్లో కూడా ఈ షేర్ల ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News