Amazon Layoff : అమెజాన్ లో ఘోర తప్పిదం..ఉద్యోగం పీకేయకముందే బై బై మెసేజ్‌లు..ఉద్యోగుల్లో వణుకు
ఉద్యోగం పీకేయకముందే బై బై మెసేజ్‌లు..ఉద్యోగుల్లో వణుకు
Amazon Layoff :టెక్ దిగ్గజం అమెజాన్‌లో గందరగోళం నెలకొంది. ఉద్యోగాల కోత పై ఆ సంస్థ మేనేజ్‌మెంట్ చేసిన ఒక చిన్న పొరపాటు వందలాది మంది ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. తీసేయకముందే మీరు ఉద్యోగంలో లేరు అనే అర్థం వచ్చేలా పొరపాటున ఈమెయిల్స్ వెళ్లడంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగంలో కలకలం రేగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే టెక్ ప్రపంచంలో మేనేజ్‌మెంట్ వైఫల్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ మరియు క్లౌడ్ కంపెనీ అయిన అమెజాన్‌లో అంతర్గత సమన్వయ లోపం బయటపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు మంగళవారం సాయంత్రం ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో "కెనడా, అమెరికా, కోస్టారికాలో ప్రభావితమైన ఉద్యోగులకు ఇప్పటికే సమాచారం అందించాము" అని ఉంది. కానీ ఆ సమయానికి ఎవరికీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అంటే బుధవారం పంపాల్సిన ఈమెయిల్స్ పొరపాటున ఒకరోజు ముందే వెళ్లిపోయాయి. దీంతో అసలు ఎవరి ఉద్యోగం ఉందో, ఎవరిది ఊడిందో తెలియక ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఈమెయిల్ అమెజాన్ అప్లైడ్ ఏఐ సొల్యూషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొలీన్ ఆబ్రే పేరుతో వెళ్ళింది. ఈ పొరపాటు జరిగిన వెంటనే కంపెనీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ యాప్ స్లాక్లో ప్రశ్నల వర్షం కురిసింది. హతాశులైన ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌ను నిలదీయడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన అధికారులు బుధవారం ఉదయం జరగాల్సిన టీమ్ మీటింగ్ ఇన్వైట్లను వెంటనే క్యాన్సిల్ చేశారు. ఈ లేఆఫ్ ప్రక్రియకు కంపెనీ అంతర్గతంగా ప్రాజెక్ట్ డాన్ అని పేరు పెట్టినట్లు ఈ లీకైన ఈమెయిల్ ద్వారా బయటపడింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ వారం అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో వేలాది మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. కేవలం AWS మాత్రమే కాకుండా రీటెయిల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రిసోర్సెస్ యూనిట్లపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. గతేడాది అక్టోబర్‌లోనే అమెజాన్ సుమారు 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించవచ్చని సంకేతాలిచ్చింది. ఇది అమెజాన్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో చిన్న మొత్తమే అయినప్పటికీ, కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో ఏకంగా 10 శాతం కావడం గమనార్హం.
ఈ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మానవ వనరుల అవసరం లేని చోట ఏఐని ప్రవేశపెడుతున్నామని, అందుకే కొన్ని పోస్టులు కనుమరుగవుతున్నాయని కంపెనీ హెచ్ఆర్ హెడ్ బెత్ గాలెట్టి గతంలోనే ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. మంగళవారం పొరపాటున వెళ్ళిన ఈమెయిల్‌లో ఇంకా పబ్లిష్ కాని ఒక బ్లాగ్ పోస్ట్ లింక్ కూడా ఉంది. దీన్ని బట్టి లేఆఫ్స్ ప్లాన్ పక్కాగా ఉందని, కానీ దాన్ని అమలు చేయడంలో అమెజాన్ మేనేజ్‌మెంట్ ఘోరంగా విఫలమైందని స్పష్టమవుతోంది.