Ambani Vs Adani : అంబానీ స్పీడుకి అదానీ బ్రేకులు పడ్డాయా? 2025లో కింగ్ ఎవరంటే ?

2025లో కింగ్ ఎవరంటే ?

Update: 2025-12-27 10:48 GMT

Ambani Vs Adani : భారతదేశపు ఇద్దరు కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మధ్య సంపద వేటలో 2025 వ సంవత్సరం ఒక సరికొత్త మలుపును చూపించింది. ఈ ఏడాదిలో ఎవరి అదృష్టం ఎలా మెరిసింది? ఎవరి షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి? అనే ఆసక్తికర చర్చకు తెరలేచింది. తాజా గణాంకాల ప్రకారం, అంబానీ తన అగ్రస్థానాన్ని కాపాడుకోవడమే కాకుండా, తన సంపదను భారీగా పెంచుకుని రేసులో ముందంజలో నిలిచారు. అదానీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అంబానీ వేగాన్ని అందుకోలేకపోయారు.

అంబానీ రిలయన్స్ అరాచకం

2025లో ముకేశ్ అంబానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సుమారు 30% మేర లాభపడటమే. దీనివల్ల ఆయన నెట్ వర్త్ ఒకే ఏడాదిలో 15 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి, మొత్తం సంపద 105-108 బిలియన్ డాలర్లకు చేరింది. ముఖ్యంగా జియో టెలికాం, రిటైల్ రంగాల్లో అద్భుతమైన వృద్ధి కనిపించడంతో ఇన్వెస్టర్లు అంబానీపై విపరీతమైన నమ్మకాన్ని చూపారు. దీనికి తోడు 2026లో రాబోయే జియో ఐపీఓ అంచనాలు కూడా అంబానీ సంపదకు రెక్కలు తొడిగింది.

గ్రీన్ ఎనర్జీ.. ఏఐ వేట

కేవలం పాత వ్యాపారాలే కాకుండా, భవిష్యత్తుపై అంబానీ వేసిన స్కెచ్ అదిరిపోయింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడంతో పాటు రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో కృత్రిమ మేధ రంగంలోకి అడుగుపెట్టడం మార్కెట్‌ను ఆకట్టుకుంది. ఈ వ్యూహాత్మక అడుగులే అంబానీని 2025లో భారత దేశపు బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్ గా నిలబెట్టాయి.

అదానీ కమ్ బ్యాక్.. కానీ..

గౌతమ్ అదానీకి 2025 ఒక రకంగా రికవరీ ఏడాది అని చెప్పవచ్చు. పాత వివాదాల నుంచి కోలుకుని అదానీ పవర్, అదానీ పోర్ట్స్ వంటి షేర్లు రాణించడంతో ఆయన సంపద కూడా దాదాపు 14.2 బిలియన్ డాలర్లు పెరిగింది. అయితే ఏడాది చివరలో ఆయన మొత్తం ఆస్తి సుమారు 92 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఇది అంబానీ ఆస్తి కంటే గణనీయంగా తక్కువే. భవిష్యత్తు కోసం అదానీ ఏకంగా 145 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12 లక్షల కోట్లు) ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను ప్రకటించినప్పటికీ, ప్రస్తుత రేసులో మాత్రం అంబానీ వెంటే ఉండిపోయారు.

సంపదలో పెరిగిన దూరం

2025 ముగిసే సమయానికి అంబానీ నంబర్-1, అదానీ నంబర్-2 స్థానాల్లో కొనసాగుతున్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో కూడా అంబానీ టాప్-10 దరిదాపుల్లో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అదానీ అగ్రెసివ్ గ్రోత్ స్ట్రాటజీ మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి కానీ, 2025 మాత్రం క్లియర్ గా ముకేశ్ అంబానీదే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News