Amrik Sukhdev Dhaba : ఎలాంటి ప్రకటనలు లేకుండానే రూ. 8 కోట్లు సంపాదిస్తున్న అమీర్ ధాబా సీక్రెట్ ఇదే !
రూ. 8 కోట్లు సంపాదిస్తున్న అమీర్ ధాబా సీక్రెట్ ఇదే !;
Amrik Sukhdev Dhaba : హర్యానాలోని ముర్తల్‌లో ఉన్న అమ్రిక్ సుఖ్‌దేవ్ ధాబా ఇప్పుడు కేవలం ఒక ధాబా కాదు ఒక బ్రాండ్. ఒకప్పుడు కేవలం ట్రక్ డ్రైవర్లు మాత్రమే ఆగే ఈ ప్రదేశం, ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుండి వచ్చేవారికి వెళ్ళేవారికి మొదటి ఆప్షన్‌గా మారింది. ఎలాంటి టీవీ యాడ్స్, సోషల్ మీడియా ప్రచారం లేదా సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్ లేకుండానే ఈ ధాబా ప్రతి నెలా దాదాపు రూ.8 కోట్లు సంపాదిస్తుంది. అంతేకాదు, ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక ధాబా అని చెబుతున్నారు. ఆలు పరాఠాలు అమ్మి అమ్రిక్ సుఖ్‌దేవ్ ధాబా ఏటా కోట్లలో సంపాదిస్తుంది.
సీఏ సార్థక్ అహూజా తన ఒక వీడియోలో అమ్రిక్ సుఖ్‌దేవ్ ధాబా ఆదాయ వివరాలను చెప్పుకొచ్చారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ధాబాలో ఒకేసారి 600 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ప్రతి టేబుల్‌పై దాదాపు 45 నిమిషాలకు కొత్త కస్టమర్లు వస్తుంటారని అంచనా. ఈ లెక్కన రోజుకు సుమారు 9000 మంది కస్టమర్లు ఇక్కడ భోజనం చేస్తారు. ప్రతి వ్యక్తి సగటున రూ.300 ఖర్చు చేస్తే, రోజువారీ ఆదాయం సుమారు రూ.27 లక్షలు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ధాబా ఒక చిన్న రెస్టారెంట్ కాదు, భారీగా విస్తరిస్తున్న ఒక ఫుడ్ బ్రాండ్ అని అర్థమవుతుంది.
అమ్రిక్ సుఖ్‌దేవ్ ధాబాను 1956లో సర్దార్ ప్రకాష్ సింగ్ ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇది కేవలం ట్రక్ డ్రైవర్ల కోసం మాత్రమే ఉండేది. కానీ, క్వాలిటీ, పరిశుభ్రత, సర్వీస్ కారణంగా దీని పేరు పెరుగుతూ వచ్చింది. నేడు ఆయన కుమారులు అమ్రిక్, సుఖ్‌దేవ్ ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ ధాబాకు ఉన్న మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే.. వారికి సొంత భూమి ఉండడం. దీనివల్ల అద్దె ఖర్చులు ఉండవు. అలాగే, దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ పని చేస్తారు. ఒక ఉద్యోగికి సగటు జీతం రూ.25,000 అయినప్పటికీ మొత్తం సిబ్బంది ఖర్చు మొత్తం ఆదాయంలో 5-6శాతం మాత్రమే ఉంటుంది. ఇది చాలా తక్కువ.
అమ్రిక్ సుఖ్‌దేవ్ ధాబాకు ప్రపంచంలోని టాప్ లెజెండరీ రెస్టారెంట్ల జాబితాలో కూడా చోటు లభించింది. ఎలాంటి పెద్ద బ్రాండింగ్, భారీ మార్కెటింగ్ లేకుండానే ఇంతటి గుర్తింపు పొందిన భారతదేశంలోని ఏకైక ధాబా ఇదే కావడం విశేషం. ఈ ధాబా అతిపెద్ద ప్రత్యేకత ఇక్కడ దొరికే ఆహారం. నోరూరించే ఆలు పరాఠాలు, శుభ్రంగా, అందంగా ఉండే కూర్చునే స్థలం, సమయానికి సరిగ్గా అందించే సేవ దీనికి ప్రధాన ఆకర్షణలు.