Chandrababu : ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ పరికరాల ఉత్పత్తికి ఏపీ అనుకూలం

ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 పై చంద్రబాబు సమీక్ష;

Update: 2025-07-21 11:53 GMT
  • రాయలసీమలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు
  • మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాలు నెరవేరేలా నూతన పాలసీ

రాయలసీమలో శ్రీసిటీ, హిందుపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులను సూచించారు. సోమవారం సచివాలయంలో నూతనంగా రూపొందించిన ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0’ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025-30 ల మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించటం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది దేశంలో 70 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు తెలపగా.... ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్ , మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అయితే అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా ఏపీలో భారీస్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్‌ను సృష్చించటం అనేది కీలకమైన అంశమని పేర్కోన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ విస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకో సిస్టంను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఈ రంగంలో బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి లభ్యత తీవ్రంగా ఉందని ఏపీకి ఇది సానుకూల అంశమని... రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ పరిశ్రమల్ని స్థాపించేందుకు అనుకూల ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీసిటీ, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రతీ ఇంటికీ ఓ పారిశ్రామిక వేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.

మూడు రీజియన్లు ఐటీ కంపెనీలకు అనుకూలం

విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలకు కేటాయించటం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖలో ఐటీ ఐటీఈఎస్ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఈ ప్రాంతాల్లో కోవర్కింగ్ స్పేస్‌లను కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. విశాఖ, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్ తో ఇతర పోర్టల్స్ ను కూడా ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా యువతకు నైపుణ్యాలను పెంచాల్సి ఉందన్నారు. అలాగే విద్యా రంగంలోనూ కొత్త పాఠ్యాంశాలను జోడించాలని సీఎం సూచించారు. తద్వారా రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభ్యం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. నాలెడ్జి ఎకానమీలో ఏపీ నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

Tags:    

Similar News