Apple : ఎట్టకేలకు రూ.1000కోట్లతో బెంగళూరులో అడుగుపెట్టిన యాపిల్
బెంగళూరులో అడుగుపెట్టిన యాపిల్;
Apple : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే దేశంలో రెండు రిటైల్ స్టోర్‌లను ప్రారంభించి, భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన యాపిల్, ఇప్పుడు బెంగళూరులో తన కార్పొరేట్ ఆఫీసును భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ఏకంగా రూ.1,000 కోట్లతో భారీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుని, బెంగళూరు చరిత్రలో అతిపెద్ద లీజు ఒప్పందాలలో ఒకటిగా నిలిచింది. ఈ భారీ పెట్టుబడి ద్వారా భారతదేశంలో యాపిల్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుందని స్పష్టమవుతోంది.
యాపిల్ సంస్థ బెంగళూరులోని వసంతనగర్‌లో ఉన్న సాన్కీ రోడ్‌లో ఉన్న ఎంబసీ జెనిత్ అనే ప్రముఖ భవనంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భవనంలోని మొత్తం తొమ్మిది అంతస్తులను 10 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి లీజుకు తీసుకుంది. ఈ 9 అంతస్తులలో మొత్తం 2.7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని యాపిల్ వినియోగించుకోనుంది. దీనికి గాను, యాపిల్ నెలకు రూ.6.315 కోట్ల అద్దెను చెల్లించనుంది. దీని ప్రకారం, ప్రతి చదరపు అడుగుకు అద్దె రూ.235గా ఉంది. ఈ భారీ అద్దెతో పాటు, ప్రతి సంవత్సరం అద్దెను 4.5% పెంచుతారు. అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌గా యాపిల్ ఏకంగా రూ.31.57 కోట్లు చెల్లించింది. ఈ ఆఫీసులో దాదాపు 1,200 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉందని అంచనా.
ఈ భారీ ఒప్పందమే కాకుండా, ఎంబసీ జెనిత్ భవనంలో దిగువ నాలుగు అంతస్తులను (1.21 లక్షల చదరపు అడుగులు) కూడా లీజుకు తీసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఒప్పందం కూడా కుదిరితే యాపిల్ ఈ భవనంలో మొత్తం 13 అంతస్తులను, 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇది యాపిల్ సంస్థ భారతదేశంలో తమ కార్యకలాపాలను ఎంత వేగంగా విస్తరించాలనుకుంటుందో తెలియజేస్తుంది. ఈ విస్తరణలు ఉద్యోగ కల్పనకు కూడా దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
యాపిల్ ఇప్పటికే బెంగళూరులో ఇతర కార్యాలయాలను కూడా నడుపుతోంది. కబ్బన్ రోడ్‌లోని ప్రెస్టీజ్ మిన్స్క్ స్క్వేర్ భవనంలో 1.16 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ.2.43 కోట్లకు లీజుకు తీసుకుంది. అలాగే, బట్టరాయణపురలో 8,000 చదరపు అడుగుల స్థలాన్ని కూడా లీజుకు తీసుకుంది. కార్పొరేట్ ఆఫీసులతో పాటు, తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి తీసుకురావడానికి యాపిల్ భారతదేశంలో రిటైల్ స్టోర్లను కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో స్టోర్లను ప్రారంభించిన యాపిల్, ఇప్పుడు బెంగళూరు, పుణె నగరాలలో మరో నాలుగు రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.