UPI : రోజూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా ? అయితే మీకు నోటీసులు రావొచ్చు

అయితే మీకు నోటీసులు రావొచ్చు;

Update: 2025-08-05 06:52 GMT

UPI : ఈ రోజుల్లో డిజిటల్ పేమెంట్లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. టీ కొట్టులో రూ.10, కూరగాయల కొట్టులో రూ.50 లేదా ఇంట్లో పనిచేసేవారికి రూ.500 వంటి చిన్న మొత్తాల పేమెంట్లు సర్వసాధారణం. చాలామంది ఇవి చిన్న మొత్తాలే కాబట్టి ఆదాయ పన్ను శాఖ వీటిని పట్టించుకోదని అనుకుంటారు. కానీ మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న లావాదేవీలు క్రమం తప్పకుండా జరిగితే, ఒక ఏడాదిలో అది భారీ మొత్తంగా మారవచ్చు. అప్పుడు ఆదాయపు పన్ను శాఖ మీపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

చిన్న మొత్తాలు కూడా ఎలా పెద్ద సమస్యగా మారతాయి?

ఉదాహరణకు, మీరు రోజుకు రూ.400 ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా ఒకే వ్యక్తికి పంపితే అది నెలకు రూ.12,000 అవుతుంది. ఏడాదికి ఈ మొత్తం రూ.లక్షకు పైగా చేరుకుంటుంది. ఒకవేళ మీరు ఈ డబ్బును ఏదైనా సేవకు లేదా పనికి ప్రతిఫలంగా ఇస్తున్నట్లయితే దీనిని ఆదాయంగా పరిగణించవచ్చు. అప్పుడు మీరు ఈ మొత్తాన్ని మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‎లో చూపించాల్సిన అవసరం ఉంటుంది. దీనిని మీరు దాచిపెడితే భవిష్యత్తులో సమస్యలు రావొచ్చు.

ట్రాన్సాక్షన్ల ప్యాటెర్న్‌పై ఐటీ శాఖ నిఘా

ఆదాయపు పన్ను శాఖ కేవలం పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలనే కాదు, మీరు చేసే లావాదేవీల ప్యాటెర్న్‌ను కూడా గమనిస్తుంది. ఒకవేళ మీరు ఒకే వ్యక్తికి, ఒకే మొత్తాన్ని పదే పదే పంపుతున్నా లేదా అందుకుంటున్నా, ఐటీ శాఖ దీనిని ఒక వ్యాపార కార్యకలాపంగా అనుమానించే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీరు ట్యూషన్ క్లాసులు చెప్పి, ప్రతి విద్యార్థి నుండి నెలకు రూ.2,000 తీసుకుంటున్నారనుకోండి. ఇలా ప్రతి నెల క్రమం తప్పకుండా జరిగే ట్రాన్సాక్షన్లను ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. ఎందుకు వస్తోంది అనే వివరాలు అడగవచ్చు.

యూపీఐ డేటా ఐటీ శాఖకు ఎలా అందుతుంది?

యూపీఐ ద్వారా చేసే ప్రతి పేమెంట్ డేటా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంకుల ద్వారా ఆదాయపు పన్ను శాఖకు అందుతుంది. ఏ అకౌంట్లో ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి అనే వివరాలను ఈ డేటా తెలియజేస్తుంది. కాబట్టి, మీరు చేసే రూ.100, రూ.200 వంటి చిన్న పేమెంట్లు కూడా క్రమం తప్పకుండా జరిగితే, అవి పన్ను అధికారుల దృష్టికి వచ్చే అవకాశం ఉంది.

ఏ లావాదేవీలకు టాక్స్ చెల్లించాలి?

అన్ని లావాదేవీలకు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మీరు రోజువారీ ఖర్చుల కోసం అంటే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాల బిల్లు వంటి వాటికి యూపీఐ ద్వారా డబ్బు చెల్లిస్తే, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ, ఒకవేళ మీరు ట్యూషన్లు చెప్పినా, చిన్నపాటి ఫ్రీలాన్స్ పనులు చేసినా, లేదా చిన్న వ్యాపారం నడుపుతూ వాటికి సంబంధించిన డబ్బును డిజిటల్ మాధ్యమాల ద్వారా అందుకుంటున్నట్లయితే, అది మీ ఆదాయంగా పరిగణించబడుతుంది. మీ మొత్తం ఆదాయం పన్ను పరిమితి దాటితే, ఆ ఆదాయాన్ని మీరు ఐటీఆర్ లో చూపించడం తప్పనిసరి.

ఐటీఆర్‌లో సరైన సమాచారం ఇవ్వడం ఎందుకు ముఖ్యం?

డిజిటల్ ఇండియా చొరవతో ఆర్థిక లావాదేవీలు సులభం అయ్యాయి. కానీ దీంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కేవలం కోట్ల రూపాయల లావాదేవీలనే కాకుండా, చిన్న మొత్తంలో జరిగే పేమెంట్లను కూడా గమనిస్తోంది. పన్ను వ్యవస్థ ఇప్పుడు మరింత డేటా ఆధారితంగా మారింది. అందుకే డిజిటల్ మాధ్యమాల ద్వారా డబ్బును పంపినా, స్వీకరించినా, ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పూర్తి సమాచారం ఇవ్వడం మంచిది. నిజాయితీగా మీ ఆదాయాన్ని తెలియజేస్తే భవిష్యత్తులో నోటీసులు లేదా పెనాల్టీలు వచ్చే ప్రమాదం ఉండదు.

Tags:    

Similar News