Auto Stocks Crash : ఆటో షేర్ల అల్లకల్లోలం..మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు ఢమాల్
మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు ఢమాల్
Auto Stocks Crash : భారత స్టాక్ మార్కెట్‌లో ఆటోమొబైల్ కంపెనీల షేర్లు మంగళవారం భారీగా కుప్పకూలాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ కంపెనీల ఇన్వెస్టర్లకు ఈరోజు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వార్తలే ఈ పతనానికి ప్రధాన కారణం. యూరప్ నుంచి వచ్చే కార్లపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం భారీగా తగ్గించనుందనే సంకేతాలతో దేశీయ కార్ల తయారీ సంస్థల భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది.
భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం ఉన్న 110% పన్నును ఏకంగా 40%కి తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా 15,000 యూరోల ($17,739) కంటే ఎక్కువ ధర కలిగిన విదేశీ కార్లపై ఈ పన్ను తగ్గింపు తక్షణమే అమలులోకి రానుంది. దీనివల్ల ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ వంటి కంపెనీలతో పాటు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ బ్రాండ్లకు భారత మార్కెట్లో భారీ వెసులుబాటు కలుగుతుంది.
ఈ వార్త బయటకు రావడంతోనే మంగళవారం మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 5.1% పడిపోయి ఆగస్టు 2025 తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. హ్యుందాయ్ ఇండియా 4.5%, మారుతీ సుజుకీ 3%, టాటా మోటార్స్ 2% చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒక్కరోజే 2.2% పతనమైంది. విదేశీ కార్లు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే, దేశీయంగా తయారయ్యే కార్ల అమ్మకాలు తగ్గిపోతాయని, ఇది 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తిని దెబ్బతీస్తుందని భారతీయ కంపెనీలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. విదేశీ పోటీని తట్టుకోవడం మన కంపెనీలకు సవాలుగా మారనుంది.
అయితే మార్కెట్ విశ్లేషకులు మరో కోణాన్ని కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో యూరప్ కంపెనీల వాటా 4% కంటే తక్కువగా ఉంది. ఇక్కడ మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీలదే ఆధిపత్యం. దిగుమతి అయ్యే కార్లు చాలా వరకు కోటి రూపాయల పైన ఉండే సూపర్ లగ్జరీ విభాగంలోనే ఉంటాయి కాబట్టి, సామాన్యులు కొనే కార్ల అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఎంకే గ్లోబల్ వంటి సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, ఆడి వంటి సంస్థలు తమ విడిభాగాలను భారత్‌కు తెచ్చి ఇక్కడే అసెంబుల్ చేస్తున్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఒప్పందం వల్ల మన దేశానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. భారత్ నుండి యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి అయ్యే మోటార్ సైకిళ్లపై ఉన్న 8% పన్ను తగ్గనుంది. ఇది బజాజ్ ఆటో (KTM, Triumph), టీవీఎస్ మోటార్ (BMW, Norton) వంటి కంపెనీలకు వరంగా మారనుంది. యూరప్‌లో మన బైక్‌ల ధరలు తగ్గి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి కార్ల కంపెనీలకు షాక్ తగిలినా, టూ వీలర్ ఎగుమతిదారులకు మాత్రం ఈ డీల్ సానుకూలంగా మారేలా కనిపిస్తోంది.