Bank Jobs : బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉత్సాహం.. త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ!
త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ!;
Bank Jobs : బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలో 50,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులపై పనిభారం పెరిగిందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ నియామకాలు ఉద్యోగులకు చాలా ఉపశమనం కలిగిస్తాయి. ఈ కొత్త ఉద్యోగాల్లో సుమారు 21,000 మంది అధికారులు ఉంటారు, మిగిలినవి క్లర్క్, ఇతర పోస్టులు ఉంటాయి.
ఎస్‌బీఐ, పీఎన్‌బీలో భారీ ఖాళీలు
భారతీయ స్టేట్ బ్యాంక్ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్‌బీఐ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20,000 మందిని నియమించుకోనుంది. ఇప్పటికే, కస్టమర్ల సేవలను మెరుగుపరచడానికి 505 ప్రొబేషనరీ ఆఫీసర్‌లను, 13,455 జూనియర్ అసోసియేట్‌లను భర్తీ చేసింది. ఈ జూనియర్ అసోసియేట్‌ల నియామకాలు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ : దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన పీఎన్‌బీ, ఈ ఏడాది 5,500 మందికి పైగా ఉద్యోగులను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంక్ సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలు
ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ బ్యాంకులకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. బ్యాంకులు తమ అనుబంధ సంస్థలలో పెట్టిన పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయడం ద్వారా డబ్బుగా మార్చుకోవాలని సూచించింది. దీని వల్ల బ్యాంకులకు మంచి లాభాలు వస్తాయని తెలిపింది. సుమారు 15 ప్రభుత్వ బ్యాంకుల అనుబంధ సంస్థలు లేదా జాయింట్ వెంచర్లు భవిష్యత్తులో ఐపీఓ లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం.