RTGS, NEFT, IMPS, ECS..బ్యాంకుల్లో ఉన్న వివిధ పేమెంట్ సిస్టమ్స్, ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్ లిమిట్స్ ఇవే!
వివిధ పేమెంట్ సిస్టమ్స్, ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్ లిమిట్స్ ఇవే!
RTGS, NEFT, IMPS, ECS..బ్యాంకుల్లో ఉన్న వివిధ పేమెంట్ సిస్టమ్స్, ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్ లిమిట్స్ ఇవే!
ఈ రోజుల్లో డబ్బు పంపడం చాలా సులభం అయిపోయింది. కానీ, ఏ పద్ధతిలో డబ్బు పంపితే లాభం, దేనికి ఎంత ఛార్జ్ పడుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల HDFC, ICICI, SBI వంటి కొన్ని బ్యాంకులు తమ వివిధ సర్వీస్ ఛార్జ్‌లను సవరించాయి. ముఖ్యంగా NEFT, IMPS వంటి పేమెంట్ సర్వీస్‌లకు ఛార్జ్‌లను పెంచాయి. అసలు బ్యాంకుల్లో ఎన్ని రకాల పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటికి ఎంత ఫీజు పడుతుంది, ఎంత మొత్తం పంపడానికి అవకాశం ఉంది అనే విషయాలన్నీ ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.
బ్యాంకుల్లో వివిధ రకాల పేమెంట్ పద్ధతులు:
NEFT (National Electronic Funds Transfer)
IMPS (Immediate Payment Service)
RTGS (Real Time Gross Settlement)
ECS / ACH (Electronic Clearing Service / Automated Clearing House)
1. NEFT: బ్యాచ్‌లలో సెటిల్‌మెంట్, ఆన్‌లైన్‌లో ఛార్జీలు లేవు
NEFT అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్. ఈ పద్ధతిలో డబ్బు పంపినప్పుడు, ట్రాన్సాక్షన్లు వెంటనే జరగవు. కొన్ని ట్రాన్సాక్షన్లను కలిపి ఒక బ్యాచ్ గా చేసి, వాటిని సెటిల్‌మెంట్ చేస్తారు. ఒక బ్యాచ్ పూర్తయిన తర్వాత మరొక బ్యాచ్ ఇలా గ్రూపులుగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి, డబ్బు స్వీకరించేవారి ఖాతాలోకి చేరడానికి 30 నిమిషాల నుండి ఒక గంట వరకు సమయం పట్టవచ్చు. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ శాఖ ద్వారా NEFT చేయవచ్చు. ఆన్‌లైన్‌లో NEFT ద్వారా డబ్బు పంపడానికి సాధారణంగా ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ బ్యాంక్ శాఖల ద్వారా చేస్తే రూ.2 నుండి రూ.25 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు.
2. IMPS: ఇమ్మీడియేట్ మనీ ట్రాన్స్ఫర్.. రూ.5 లక్షల వరకు లిమిట్
IMPS అంటే ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్. ఇది NPCI (National Payments Corporation of India) ద్వారా అభివృద్ధి చేయబడిన పేమెంట్ సిస్టమ్. దీని ప్రత్యేకత ఏమిటంటే, డబ్బు పంపిన వెంటనే స్వీకరించేవారి ఖాతాలోకి జమ అవుతుంది. మనం రోజువారీగా ఉపయోగించే UPI (Unified Payments Interface) కూడా ఇదే ప్లాట్‌ఫామ్ కింద అభివృద్ధి చేయబడింది. IMPS ద్వారా మీరు రూ.5 లక్షల వరకు డబ్బు పంపవచ్చు. IMPS సేవలు సాధారణంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ శాఖలలో NEFT, RTGS పద్ధతులు ఉంటాయి. IMPS ద్వారా డబ్బు పంపడానికి రూ.2 నుండి రూ.15 వరకు ఛార్జీలు ఉంటాయి.
3. RTGS: పెద్ద మొత్తాలకు బెస్ట్ ఆప్షన్, తక్షణమే సెటిల్‌మెంట్
RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్. IMPS లాగానే, ఇది కూడా డబ్బును రియల్ టైమ్‌లో, అంటే వెంటనే స్వీకరించేవారి ఖాతాలోకి జమ చేస్తుంది. NEFT లాగా బ్యాచ్ ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. RTGS ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను మాత్రమే పంపడానికి వీలుంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు పంపడానికి ఇది అనువైన పద్ధతి. RTGS ద్వారా డబ్బు పంపడానికి రూ.15 నుండి రూ.45 వరకు ఛార్జీలు ఉంటాయి.
కస్టమర్‌లు ఏ పేమెంట్ విధానాన్ని ఎంచుకోవాలి?
మీ అవసరాన్ని బట్టి సరైన పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు:
UPI: ప్రస్తుతం UPI ద్వారా డబ్బు పంపడానికి ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే, దీనికి రోజువారీ పరిమితి ఉంటుంది.
IMPS: రూ.లక్ష పైన రూ.5 లక్షల లోపు మొత్తాలను వెంటనే పంపించాలంటే, ఆన్‌లైన్‌లో IMPS ఉపయోగించడం మంచిది.
NEFT: డబ్బు వెంటనే క్రెడిట్ అవ్వాల్సిన అవసరం లేకపోతే, NEFT ని ఆన్‌లైన్‌లో ఉపయోగించవచ్చు, దీనికి ఛార్జీలు ఉండవు.
RTGS: రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పంపాల్సి వచ్చి, అది వెంటనే ఖాతాలోకి చేరాలంటే, RTGS ఉత్తమ మార్గం. ఒకవేళ వెంటనే క్రెడిట్ అవ్వాల్సిన అవసరం లేకపోతే, ఆన్‌లైన్‌లో NEFT ని ఉపయోగించవచ్చు.