Banking Jobs : షాకింగ్ రిపోర్ట్.. బ్యాంకింగ్ ఉద్యోగులకు ఏఐ సెగ.. 2 లక్షల మంది ఇంటికే

బ్యాంకింగ్ ఉద్యోగులకు ఏఐ సెగ.. 2 లక్షల మంది ఇంటికే

Update: 2026-01-06 07:18 GMT

Banking Jobs : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతాపం సాఫ్ట్‌వేర్ రంగం దాటి ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని తాకింది. ఐటీ రంగంలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా, ఇప్పుడు బ్యాంకింగ్ ఉద్యోగుల వంతు వచ్చింది. రాబోయే ఐదేళ్లలో కేవలం ఐరోపా బ్యాంకుల్లోనే 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంచలన హెచ్చరిక చేసింది.

ఐటీ తర్వాత బ్యాంకింగ్ వంతు

2025లో ఐటీ రంగం ఏఐ వల్ల తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇప్పుడు అదే పరిస్థితి బ్యాంకింగ్ రంగానికి విస్తరిస్తోంది. మోర్గాన్ స్టాన్లీ మొత్తం 35 ఐరోపా బ్యాంకులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. ఈ బ్యాంకుల్లో ప్రస్తుతం సుమారు 21.2 లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే డిజిటలైజేషన్ పెరగడం, బ్యాంక్ బ్రాంచ్‌లు మూతపడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీనివల్ల భారీగా సిబ్బందిని తగ్గించుకోవాలని బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి.

ముప్పు పొంచి ఉన్న విభాగాలు

బ్యాంకింగ్ రంగంలో రోజూ జరిగే రొటీన్ పనులు, డేటా ఎంట్రీ, రిపోర్ట్‌ల తయారీ వంటి పనులను ఏఐ చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తోంది. అందుకే బ్యాక్-ఆఫీస్, రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్స్, మిడిల్ ఆఫీస్ విభాగాల్లో పనిచేసే వారికి ముప్పు ఎక్కువగా ఉంది. ఏఐ వాడటం వల్ల బ్యాంకుల పనితీరు 30 శాతం పెరుగుతుందని అంచనా. ఖర్చులు తగ్గించుకోవాలని ఇన్వెస్టర్ల నుండి ఒత్తిడి పెరుగుతుండటంతో బ్యాంకులు ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయి.

ముందే మొదలైన కోతలు

కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. డచ్ బ్యాంకు ABN Amro 2028 నాటికి తమ సిబ్బందిలో 20 శాతం కోత విధిస్తామని ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన Société Générale సీఈఓ కూడా వ్యయ నియంత్రణ కోసం ఏ విభాగమైనా సిద్ధంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు యుబిఎస్ వంటి బ్యాంకులు తమ లీడర్లకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఏఐ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి. అయితే జేపీ మోర్గాన్ వంటి దిగ్గజాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఏఐ వల్ల జూనియర్ ఉద్యోగుల నైపుణ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News