Rice Export : ఇరాన్ మార్కెట్ క్లోజ్..సముద్రం మధ్యలోనే చిక్కుకున్న 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం
సముద్రం మధ్యలోనే చిక్కుకున్న 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం
Rice Export : పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంట గదులపై, ముఖ్యంగా బాస్మతి బియ్యం వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తన సువాసనతో అందరినీ అలరించే భారతీయ బాస్మతి బియ్యం, ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోవడంతో గోదాముల్లోనే మూలుగుతోంది. ఢిల్లీలోని నయా బజార్ వంటి పెద్ద మార్కెట్ల నుంచి విదేశాలకు వెళ్లాల్సిన బియ్యం నిల్వలు ఇప్పుడు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన దేశ వ్యాపారులను, రైతులను, దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.
సముద్రం మధ్యలో నాలుగు లక్షల టన్నుల బియ్యం
నిపుణుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల టన్నుల బాస్మతి బియ్యం వివిధ చోట్ల నిలిచిపోయింది. అందులో కొంత సరుకు సముద్రం మధ్యలో ఓడల్లో ఉండగా, మరికొంత రేవుల్లో క్లియరెన్స్ కోసం వేచి చూస్తోంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారడం, ఇన్సూరెన్స్ కంపెనీలు షిప్పులకు కవరేజ్ ఇచ్చేందుకు వెనకాడటంతో ఎగుమతిదారులు తమ సరుకును పంపలేకపోతున్నారు. కేవలం ఇరాన్ మాత్రమే కాదు.. ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఖతార్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆర్డర్లు ఉన్నప్పటికీ గోదాముల్లో బియ్యం బస్తాలపై దుమ్ము పేరుకుపోతోంది.
కుప్పకూలుతున్న ధరలు
ఫిబ్రవరి నెలలో బాస్మతి బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆ సమయంలో ధరలు 5 నుంచి 10 శాతం మేర పెరిగాయి. కానీ, యుద్ధం మొదలైనప్పటి నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గత నాలుగు రోజుల్లోనే బాస్మతి బియ్యం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 10 శాతం మేర పడిపోయాయి. ఎగుమతులు ఆగిపోవడంతో ఆ సరుకంతా దేశీయ మార్కెట్‌లోకి వస్తోంది, ఫలితంగా భారత్‌లో కూడా బాస్మతి ధరలు 5 నుంచి 6 శాతం తగ్గాయి. ఇది వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినా, పండించిన రైతులకు, నిల్వ చేసుకున్న వ్యాపారులకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చుతోంది.
దుబాయ్ ఆర్డర్లు గాల్లో దీపాలేనా?
ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్‌లో జరిగిన భారీ ఫుడ్ ఈవెంట్ ద్వారా భారతీయ వ్యాపారులకు భారీగా ఎగుమతి ఆర్డర్లు వచ్చాయి. కానీ, యుద్ధం రావడంతో ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆర్డర్లు ఉన్నా పేమెంట్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడం ఎగుమతిదారులను కలవరపెడుతోంది. అమెరికా ఆంక్షల భయంతో ఇరాన్ నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో అందుతాయో లేదో అన్న సందేహాలు మొదలయ్యాయి. షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, కంటైనర్ల కొరత కూడా ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేశాయి.
బాస్మతికి అతిపెద్ద మార్కెట్
మన దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యంలో సుమారు 70 శాతం వాటా గల్ఫ్ దేశాలదే. అందులోనూ ఇరాన్ ఒక్కటే 25 శాతం బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు రూ.6,374 కోట్ల విలువైన బాస్మతిని ఇరాన్‌కు ఎగుమతి చేసింది. పంజాబ్, హర్యానా రైతులు పండించే నాణ్యమైన బాస్మతికి ఇరాన్ ప్రధాన మార్కెట్. అటువంటి అతిపెద్ద కొనుగోలుదారు ఇప్పుడు యుద్ధంలో మునిగిపోవడం మన వ్యవసాయ ఎగుమతులకు పెను సంకటంగా మారింది. యుద్ధం త్వరగా ముగియకపోతే బాస్మతి వ్యాపారం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.