Inflation : బీహార్ ఎన్నికల ఫలితాలతో పాటు డబుల్ ధమాకా.. ఏడాది కనిష్టానికి ధరలు!

ఏడాది కనిష్టానికి ధరలు!

Update: 2025-11-14 10:23 GMT

Inflation : బీహార్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరపడిన రోజే, దేశ సామాన్య ప్రజలకు మరో అదిరిపోయే శుభవార్త అందింది. కొద్ది నెలలుగా సామాన్యుడి నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం అనూహ్యంగా తగ్గిపోయింది. అక్టోబర్ 2025 గణాంకాల ప్రకారం.. ధరలు గత ఏడాదిలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. ఇది వరుసగా రెండో నెలలో ధరలు తగ్గడం విశేషం. పండగ సీజన్‌లో ధరలు తగ్గడం ప్రజలకు అతిపెద్ద బహుమతిగా మారింది.

ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 2025లో టోకు ధరల సూచీ 1.21% మేర తగ్గింది. అంటే టోకు మార్కెట్‌లో వస్తువుల ధరలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయాయి. ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల. దీని ప్రభావం రాబోయే రోజుల్లో రిటైల్ మార్కెట్‌పై కూడా కచ్చితంగా పడుతుందని, వస్తువులు మరింత చౌకగా లభిస్తాయని నిపుణులు అంటున్నారు.

కూరగాయలు, ఉల్లి ధరలు భారీగా తగ్గుదల

ఈ తగ్గుదలలో ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు దిగిరావడం అతిపెద్ద ఊరట. కొద్ది నెలల క్రితం కన్నీళ్లు పెట్టించిన ఉల్లిపాయల ధరలు ఇప్పుడు ఏకంగా 65% పైగా పడిపోయాయి. బంగాళాదుంపల ధరలు 39.88% తగ్గగా, పప్పుల ధరలు 16.50% తగ్గాయి. మొత్తం మీద కూరగాయల ధరలు 35% మేర పడిపోయాయి. దీంతో మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 8.31% శాతానికి తగ్గింది.

ఇంధనం, తయారీ వస్తువులు కూడా చౌక

ఆహార పదార్థాలే కాదు, ఇంధనం, గ్యాస్, విద్యుత్ ధరలు కూడా అక్టోబర్‌లో తగ్గుముఖం పట్టాయి. ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.55%గా నమోదైంది. ఇది రవాణా, పరిశ్రమల ఖర్చులను తగ్గిస్తుంది. అలాగే, ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్తువులు (లోహాలు, రసాయనాలు, యంత్రాలు) ధరలు కూడా తగ్గాయి. తయారీ రంగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లోని 2.33% నుంచి 1.54%కి పడిపోయింది.

జీఎస్టీ తగ్గింపు ప్రభావం

సెప్టెంబర్ 22న ప్రభుత్వం పలు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించడం కూడా ఈ ధరల తగ్గుదలకు ఒక ముఖ్య కారణం. ఎక్కువ పన్ను ఉన్న వస్తువులను 5% మరియు 18% శ్లాబుల్లోకి తెచ్చారు. ఈ నిర్ణయం టోకు, రిటైల్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. దీని ఫలితంగా, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా చారిత్రక కనిష్ట స్థాయి 0.25%కి చేరుకుంది.

వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ?

టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ అదుపులోకి రావడంతో, ఇప్పుడు అందరి దృష్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై పడింది. ధరలు తగ్గినప్పుడు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం పెరుగుతుంది. రాబోయే డిసెంబర్‌లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి. అదే జరిగితే, హోమ్ లోన్‌లు, కార్ లోన్‌లు, బిజినెస్ లోన్‌లపై వడ్డీ భారం తగ్గి, ప్రజలకు మరింత ఊరట లభిస్తుంది.

Tags:    

Similar News