Gratuity:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్..గ్రాట్యుటీ పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం
గ్రాట్యుటీ పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం
Gratuity: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే అతిపెద్ద ఆర్థిక భరోసా గ్రాట్యూటీ. ఒక ఉద్యోగి తన కెరీర్‌లో ఒకటికంటే ఎక్కువ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తే, గ్రాట్యుటీ లెక్కలు ఎలా ఉంటాయి? రెండు సార్లు గ్రాట్యుటీవస్తుందా? లేక రెండోసారి పని చేసినందుకు వచ్చే డబ్బులో కోత పడుతుందా? ఇలాంటి సందేహాలకు స్వస్తి పలుకుతూ కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యాక తిరిగి అదే ప్రభుత్వ వ్యవస్థలో పునర్నియామకం పొందితే, వారికి రెండోసారి గ్రాట్యుటీ లభించదు. అంటే, ఒకసారి ప్రభుత్వ ఖజానా నుంచి రిటైర్మెంట్ గ్రాట్యుటీ తీసుకున్న తర్వాత, మళ్లీ అదే సర్వీస్‌లో పనిచేసినందుకు అదనపు గ్రాట్యుటీ క్లెయిమ్ చేయడం సాధ్యపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది డబుల్ బెనిఫిట్ నిరోధించడానికి రూపొందించిన నిబంధన. అయితే, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి కేంద్ర సర్వీసులోకి వచ్చే వారి కోసం నిబంధనలు భిన్నంగా ఉన్నాయి.
ఎవరైనా ఉద్యోగి ఒక పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, సరైన అనుమతితో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరితే వారికి కొంత ఊరట లభించింది. వీరు తమ పాత సంస్థ నుంచి గ్రాట్యుటీని పొందే హక్కును కలిగి ఉంటారు. కానీ, ఇక్కడ ప్రభుత్వం ఒక పరిమితి విధించింది. పాత ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఈ రెండింటి ద్వారా వచ్చే మొత్తం గ్రాట్యుటీ కలిపి, ఒకవేళ ఆ ఉద్యోగి తన మొత్తం కెరీర్‌ను కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగించి ఉంటే ఎంత గ్రాట్యుటీ వచ్చేదో, ఆ మొత్తానికి మించకూడదు. అంటే రెండు వైపులా డబ్బులు వచ్చినప్పటికీ, గరిష్ట పరిమితికి లోబడే మీ పేమెంట్ ఉంటుంది.
ఈ కొత్త నిబంధనల్లో అత్యంత సంతోషకరమైన వార్త మాజీ సైనికులకు సంబంధించింది. సైనిక సేవ ముగించుకుని సివిల్ సర్వీసెస్‌లో చేరే వారిపై ఎటువంటి గ్రాట్యుటీ లిమిట్ వర్తించదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంటే, వారు ఆర్మీలో పని చేసినందుకు గ్రాట్యుటీ తీసుకున్నప్పటికీ, తర్వాత సివిల్ సర్వీస్‌లో వారు చేసే కాలానికి గానూ పూర్తి గ్రాట్యుటీని పొందుతారు. సైన్యం నుంచి వచ్చిన గ్రాట్యుటీ కారణంగా వారి సివిల్ సర్వీస్ గ్రాట్యుటీలో ఒక్క రూపాయి కూడా కోత విధించబడదు. వీరికి పూర్తిస్థాయిలో డబుల్ బెనిఫిట్ లభిస్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.