Bitcoin : బిట్‌కాయిన్ నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనా? ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చుక్కలు కనిపిస్తున్నాయి

ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చుక్కలు కనిపిస్తున్నాయి

Update: 2025-12-29 06:32 GMT

Bitcoin : క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న బిట్‌కాయిన్ ఇప్పుడు దారుణంగా పడిపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో లక్ష డాలర్లు దాటి రికార్డులు సృష్టించిన బిట్‌కాయిన్, ఏడాది చివరలో ఒక్కసారిగా కుప్పకూలడంతో దాన్ని నమ్ముకున్న కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బిట్‌కాయిన్‌పై భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్‌లో దారుణంగా పడిపోయాయి. అసలు బిట్‌కాయిన్ మాయాజాలం ఏంటి? కంపెనీలు ఎందుకు ఇందులో పెట్టుబడులు పెడతాయి? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాయి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అత్యాశే కొంపముంచిందా?

ఈ ఏడాది అక్టోబర్‌లో బిట్‌కాయిన్ ధర రికార్డు స్థాయిలో 1.26 లక్షల డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా కంపెనీలు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను బిట్‌కాయిన్లలోకి మార్చాయి. మరికొన్ని కంపెనీలైతే ఏకంగా అప్పులు చేసి మరీ బిట్‌కాయిన్లను కొనుగోలు చేశాయి. ధర ఇంకా పెరుగుతుందని, భారీ లాభాలు వస్తాయని ఆశించడమే ఇందుకు కారణం. కానీ నవంబర్ వచ్చేసరికి ధర 90 వేల డాలర్ల కంటే కిందకు పడిపోయింది. దీంతో ఆయా కంపెనీల వ్యాపార మోడల్‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం పోయి, షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు. ఫలితంగా కంపెనీల మార్కెట్ విలువ కూడా సగానికి పైగా పడిపోయింది.

స్ట్రాటజీ కంపెనీకి పెద్ద దెబ్బ

ప్రపంచంలోనే అత్యధికంగా బిట్‌కాయిన్లను కలిగి ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ట్రాటజీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ కంపెనీ వద్ద ఏకంగా 6.71 లక్షలకు పైగా బిట్‌కాయిన్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం బిట్‌కాయిన్లలో దాదాపు 3 శాతం ఈ ఒక్క కంపెనీ దగ్గరే ఉన్నాయి. అయితే గత ఆరు నెలల్లో ఈ కంపెనీ షేర్ విలువ సగానికి పైగా పడిపోయింది. బిట్‌కాయిన్ కొనడానికి చేసిన అప్పులు తీర్చడం ఇప్పుడు ఆ కంపెనీకి భారంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి కంపెనీ కొత్త షేర్లను జారీ చేసి సుమారు 1.44 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాల్సి వచ్చింది.

మున్ముందు పరిస్థితి ఏంటి?

బిట్‌కాయిన్ ధరలు పడిపోతుండటంతో, కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలను అమ్మడం మొదలుపెడితే ధరలు మరింతగా పతనం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల క్రిప్టో మార్కెట్‌లో ఒక విధమైన సంక్రమణ ముప్పు పొంచి ఉంది. అంటే ఒక కంపెనీ దెబ్బతింటే దాని ప్రభావం మిగతా వాటిపై కూడా పడుతుంది. అయితే ఇది కేవలం క్రిప్టో రంగానికే పరిమితం అవుతుందని, సాధారణ స్టాక్ మార్కెట్లకు పెద్దగా ముప్పు ఉండదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బిట్‌కాయిన్ ధర పడిపోవడం మళ్ళీ తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి మంచి అవకాశమని భావించే వాళ్ళు కూడా లేకపోలేదు.

Tags:    

Similar News