BSNL : జియో, ఎయిర్‌టెల్‌కు బిఎస్ఎన్ఎల్ చెక్..రూ.2626కే ఏడాది మొత్తం డేటా పండగ
రూ.2626కే ఏడాది మొత్తం డేటా పండగ
BSNL : రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టి పోటీనిస్తూ.. అత్యంత చౌక ధరకే ఏడాది పొడవునా వాలిడిటీ ఇచ్చే సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.2626కే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫీచర్లతో కూడిన భారత్ కనెక్ట్ 26 ప్లాన్‌ను లాంచ్ చేసింది. రిపబ్లిక్ డే 2026 సందర్భంగా బిఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దీనికి భారత్ కనెక్ట్ 26 అని పేరు పెట్టింది. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్లాన్ ఒక వరమనే చెప్పాలి. జనవరి 26 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ ఫిబ్రవరి 26 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందే అవకాశం ఉంది.
ఈ ప్లాన్ లో ఏమేమి వస్తాయి?
రూ.2626 రీఛార్జ్ చేసుకుంటే మీకు లభించే బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ప్రతిరోజూ 2.6GB హై-స్పీడ్ డేటా వస్తుంది. అంటే నెలకు సుమారు 78GB కి పైగా డేటా మీ సొంతం. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు వంటి అదనపు హంగులు లేవు. కేవలం కాల్స్, డేటా మాత్రమే కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ప్లాన్.
జియో, ఎయిర్‌టెల్ కంటే ఎంత చౌక?
మార్కెట్ దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఉదాహరణకు జియో లేదా ఎయిర్‌టెల్‌లో ఏడాది వాలిడిటీ కావాలంటే సుమారు రూ.3,599 ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే డేటా కూడా రోజుకు 2GB నుంచి 2.5GB మాత్రమే. కానీ బిఎస్ఎన్ఎల్ కేవలం రూ.2626కే రోజుకు 2.6GB డేటాను అందిస్తోంది. అంటే ప్రైవేట్ కంపెనీల కంటే దాదాపు రూ.973 తక్కువ ధరకే ఈ ప్లాన్ లభిస్తోంది.
రీఛార్జ్ చేసుకోవడం ఎలా?
ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు బిఎస్ఎన్ఎల్ అధికారిక చాట్‌బాట్ ప్లాట్‌ఫారమ్ (chatbot.bsnl.co.in) ద్వారా లేదా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఏడాది మొత్తం ఇంటర్నెట్, కాలింగ్ కావాలనుకునే వారికి బిఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్ ఒక చక్కని అవకాశం. 4G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, బిఎస్ఎన్ఎల్ నుంచి ఇలాంటి చౌకైన ప్లాన్లు రావడం కచ్చితంగా ఇతర టెలికాం కంపెనీలకు సవాలు విసిరే విషయమే.