BSNL : బీఎస్ఎన్ఎల్ కు కేంద్రం భారీ ప్యాకేజీ.. నెట్‌వర్క్ మార్పులకు రూ.47,000 కోట్లు

నెట్‌వర్క్ మార్పులకు రూ.47,000 కోట్లు;

Update: 2025-08-15 07:30 GMT

BSNL : భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. బీఎస్ఎన్ఎన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి, కేంద్ర ప్రభుత్వం రూ.47,000 కోట్ల భారీ పథకాన్ని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని టెలికాం శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా గురువారం వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ అప్‌గ్రేడ్, 4G నెట్‌వర్క్ విస్తరణ కోసం ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు శాఖ తెలిపింది. గతేడాది బీఎస్ఎన్ఎల్ రికార్డు స్థాయి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

గతేడాది బీఎస్ఎన్ఎల్ 4G మొబైల్ సేవలను విస్తరించడానికి రూ.25,000 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. "భారతదేశ డిజిటల్ భవిష్యత్తును బలోపేతం చేయడానికి బీఎస్ఎన్ఎల్ వేగంగా ముందుకు వెళ్తోంది. గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.25,000 కోట్ల పెట్టుబడి, ప్రస్తుతం ప్రకటించిన రూ.47,000 కోట్ల కొత్త పథకంతో, భారతదేశ టెలికాం అభివృద్ధి మరింత బలోపేతం అవుతోంది" అని అన్నారు.

గతేడాది రూ.25,000 కోట్ల ప్రాజెక్ట్‌లో ఎక్కువ భాగం టీసీఎస్, C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) కంపెనీలు పూర్తి చేశాయి. ఈ సంస్థలు బీఎస్ఎన్ఎల్ కు టెలికాం పరికరాలను అందించాయి. ఇప్పుడు, మంత్రి సింధియా బీఎస్ఎన్ఎల్ కోసం కొన్ని కీలక లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చే ఏడాదిలోగా మొబైల్ సేవల వ్యాపారాన్ని 50శాతం పెంచాలని ఆయన ఆదేశించారు.

గత నెలలో బీఎస్ఎన్ఎల్ సర్కిల్, బిజినెస్ యూనిట్ హెడ్స్‌తో జరిగిన సమీక్షా సమావేశంలో సింధియా ప్రతి యూనిట్‌కు ఎంటర్‌ప్రైజ్ వ్యాపారంలో 25-30%, ఫిక్స్‌డ్ లైన్ వ్యాపారంలో 15-20% వృద్ధి సాధించాలని సూచించారు. సంస్థ ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి, కస్టమర్ సంతృప్తిపై దృష్టి పెట్టాలని, సబ్‌స్క్రైబర్ బేస్ విస్తరించి, సగటు ఆదాయం పెంచుకోవాలని మంత్రి బీఎస్ఎన్ఎల్ కు సూచించారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సగటు ఆదాయం వివిధ సర్కిల్స్‌లో సుమారు రూ.40 నుండి రూ.175 వరకు ఉంది. దీనితో పోలిస్తే ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్‌ల సగటు ఆదాయం జూన్ త్రైమాసికంలో వరుసగా రూ.208, రూ.250గా ఉంది.

Tags:    

Similar News