Flight Tickets : డీజీసీఏ అలర్ట్.. పండుగ సీజన్లో కూడా చౌక విమాన టికెట్లు
పండుగ సీజన్లో కూడా చౌక విమాన టికెట్లు
Flight Tickets : పండుగ సీజన్ వస్తే చాలు, సొంత ఊర్లకు వెళ్లాలనుకునేవారికి విమాన టికెట్ల ధరల టెన్షన్ మొదలవుతుంది. ముఖ్యంగా దీపావళి వంటి పెద్ద పండుగలకు టికెట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతుంటాయి. అయితే, ఈ సంవత్సరం ప్రయాణీకులకు ఆ బాధలు లేవు. పండుగల సమయంలో విమాన ఛార్జీల పెరుగుదలను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్‌లైన్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరలపై నిఘా ఉంచి, అసాధారణ పెరుగుదలను అడ్డుకోవాల్సిన బాధ్యత డీజీసీఏదే అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఎయిర్‌లైన్ కంపెనీలతో చర్చలు జరిపిన తర్వాత, పండుగల సమయంలో పెరిగే ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి అదనపు సామర్థ్యాన్ని జోడిస్తామని కంపెనీలు హామీ ఇచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ అదనపు విమానాల వలన ప్రయాణీకులకు టికెట్లు సరసమైన ధరల్లో లభించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థలు నడపబోయే అదనపు విమానాల వివరాలను పరిశీలిస్తే.. ఇండిగో 42 రూట్లలో సుమారు 730, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 20 రూట్లలో దాదాపు 486, స్పైస్‌జెట్ 38 రూట్లలో సుమారు 546 అదనపు విమానాలు నడుపుతున్నాయి.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల కారణంగా ట్రావెల్ సీజన్ చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలోనే జనాదరణ పొందిన రూట్లలో ధరలు పెరుగుతాయి. ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటం కోసం, హవాయి ఛార్జీలు, విమాన సామర్థ్యంపై డీజీసీఏ కఠినంగా నిఘా ఉంచుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం నివేదిక ప్రకారం, అక్టోబర్ నెలలో భారతీయ ఎయిర్‌లైన్స్ నడపబోయే దేశీయ విమానాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 2.1% తక్కువగా ఉంది.
ఇదిలా ఉండగా భారత్, చైనా మధ్య నిలిచిపోయిన నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్ చివరి వారం నుంచి అమల్లోకి రానుంది. ఈ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో మరో ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తియాంజిన్ (చైనా)లో జరిగిన ఎస్ సీవో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్తో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ పరిణామం చైనా వైపు సాధారణ సంబంధాలను పునరుద్ధరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో భాగం. దీనికి ముందు కూడా భారత ప్రభుత్వం చైనా పౌరులకు టూరిస్ట్ వీసా సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించింది.