GST 2.0 : ఆటో, కార్ల ధరలతో పాటు ఈ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయోచ్
ఈ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయోచ్
GST 2.0 : భారతదేశంలో జీఎస్టీ వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0 విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం.. గతంలో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లను (5%, 12%, 18%, 28%) ఇప్పుడు 5%, 18% అనే రెండు ప్రధాన స్లాబ్‌లుగా తగ్గించారు. దీనికి తోడు, కొన్ని వస్తువులకు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయంతో నిత్యావసరాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు చెందిన అనేక వస్తువులు ఇకపై చౌకగా లభించనున్నాయి.
ఆహార పదార్థాలు
రోజువారీ ఉపయోగించే అనేక ఆహార పదార్థాలపై ఇప్పుడు జీఎస్టీ ఉండదు. అల్ట్రా-హై టెంపరేచర్ (UHT) పాలు, ముందుగా ప్యాక్ చేసి, లేబుల్ చేసిన పనీర్ వంటి పాల ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించారు. అలాగే, అన్ని రకాల భారతీయ బ్రెడ్‌లు – చపాతీ, రోటీ, పరాటా, ఖాఖ్రా, పిజ్జా బ్రెడ్‌లపై కూడా జీఎస్టీ మినహాయింపు లభించింది. వీటితో పాటు, కిరాణా సామాన్లు, ప్రధాన ఆహార పదార్థాలపై కూడా ధరలు తగ్గనున్నాయి.
వైద్యం, ఆరోగ్యం
ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉన్న 33 ప్రాణ రక్షక ఔషధాలపై ఇకపై జీఎస్టీ ఉండదు. ఇది రోగులకు చాలా పెద్ద ఉపశమనం. అంతేకాకుండా, క్యాన్సర్, అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మూడు ప్రత్యేక ఔషధాలపై గతంలో 5% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లతో సహా అన్ని వ్యక్తిగత ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీరో జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో ఇన్సూరెన్స్ పాలసీలు మరింత అందుబాటులోకి వస్తాయి.
విద్య, స్టేషనరీ
విద్యార్థులకు, పాఠశాలలకు కూడా ఈ జీఎస్టీ మార్పులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రాక్టీస్ బుక్స్, గ్రాఫ్ బుక్స్, ల్యాబొరేటరీ నోట్‌బుక్‌లు, నోట్‌బుక్‌లు తయారు చేయడానికి ఉపయోగించే కోటింగ్ లేని కాగితం, పేపర్‌బోర్డ్‌పై జీఎస్టీని తొలగించారు. అలాగే, మ్యాప్‌లు, అట్లాస్‌లు, గ్లోబ్‌లు, పెన్సిల్, శార్పనర్, రబ్బర్, క్రేయాన్, పేస్టల్, డ్రాయింగ్ చార్‌కోల్, టైలర్ చాక్ వంటి విద్యార్థుల ఉపకరణాలపై కూడా జీఎస్టీ ఉండదు.
రక్షణ, ఏవియేషన్
దేశ భద్రతకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. విమానాల భాగాలు, క్షిపణులు, రాకెట్లు, డ్రోన్‌లు, సి-130, సి-295MW వంటి మిలిటరీ విమానాల విడిభాగాలు వంటి వాటి దిగుమతిపై ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఉండదు. దీంతో రక్షణ రంగానికి అవసరమైన పరికరాలు చౌకగా లభించి, దేశ భద్రతకు మరింత ఊతమిస్తాయి.