Credit Card : క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే స్కోర్ తగ్గుతుందా? ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోండి

Update: 2025-10-11 05:05 GMT

Credit Card : అనవసరమైన లేదా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు వాటిని రద్దు చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు. అయితే, క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిజానికి, క్రెడిట్ కార్డును రద్దు చేయడం వల్ల స్కోర్‌పై నేరుగా ప్రభావం ఉండదు. కానీ, ఇది పరోక్షంగా మీ ఆర్థిక అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డును రద్దు చేయడం వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటి? స్కోర్ తగ్గకుండా ఉండాలంటే ఏమి చేయాలి? అనే విషయాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం తప్పు కాదు, కానీ దీని గురించి ఆలోచించడం అవసరం. కార్డును క్యాన్సిల్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై నేరుగా ప్రభావం ఉండదు, కానీ ఇది పరోక్షంగా కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను పెంచే అవకాశం ఉంది. మీ క్రెడిట్ హిస్టరీని తగ్గిస్తుంది.

క్రెడిట్ కార్డు రద్దు చేసినప్పుడు క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుందో ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణ: మీకు మూడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి అనుకుందాం. వాటి మొత్తం క్రెడిట్ లిమిట్ రూ. 50,000 (రూ. 20,000 + రూ. 10,000 + రూ. 20,000). మీరు ప్రతి నెలా ఈ కార్డులపై రూ. 25,000 ఖర్చు చేస్తున్నారు. అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 50 శాతం ఉంటుంది.

ఇప్పుడు మీరు రూ. 20,000 లిమిట్ ఉన్న కార్డును రద్దు చేశారనుకుందాం. అప్పుడు మీ మొత్తం క్రెడిట్ లిమిట్ రూ. 30,000 అవుతుంది. మీరు ఇప్పటికీ రూ. 25,000 ఖర్చు చేస్తే, మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 80 శాతం దాటుతుంది. సాధారణంగా, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే, కార్డు రద్దు చేసే ముందు ఈ లెక్కను తప్పకుండా పరిగణించాలి.

మీరు ఎక్కువ కాలం ఉపయోగించిన, బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన క్రెడిట్ కార్డు, మీ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది. క్రెడిట్ నివేదికను బ్యాంకులు పరిశీలించేటప్పుడు ఈ పాత క్రెడిట్ కార్డుల డేటా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి, దీర్ఘకాలంగా వాడుతున్న కార్డులను రద్దు చేసే ముందు తప్పకుండా ఆలోచించాలి.

క్రెడిట్ కార్డును రద్దు చేయాలనుకున్నా, మీ స్కోరు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ కింది పద్ధతులు పాటించాలి:

* కార్డును మూసివేయడానికి ముందు ఎటువంటి బకాయి బిల్లులు లేవని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.

* ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కార్డులను రద్దు చేయకూడదు.

* మీ పాత క్రెడిట్ కార్డులను వీలైనంత వరకు ఆక్టివ్‌గా ఉంచడానికి ప్రయత్నించండి.

* వార్షిక రుసుము ఎక్కువగా ఉండి, మీకు పెద్దగా ఉపయోగం లేని ప్రీమియం కార్డులను మాత్రమే రద్దు చేయవచ్చు.

* మీకు చాలా ఎక్కువ కార్డులు ఉండి, వాటిని నిర్వహించడం కష్టంగా ఉంటేనే కొన్నింటిని రద్దు చేయవచ్చు.

Tags:    

Similar News