Defense FDI Limit Hike : మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. డిఫెన్స్ రంగంలో డాలర్ల వర్షం
డిఫెన్స్ రంగంలో డాలర్ల వర్షం
Defense FDI Limit Hike : భారత రక్షణ రంగం ఇప్పుడు సరికొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. దేశీయంగా ఆయుధాల తయారీని పెంచడంతో పాటు, విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచి, నిబంధనలను భారీగా సరళతరం చేయాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. దీనివల్ల ప్రపంచ స్థాయి రక్షణ దిగ్గజాలు నేరుగా భారత్‌లోకి పెట్టుబడులతో వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగ కంపెనీల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఆటోమేటిక్ రూట్ ద్వారా కేవలం కొత్త లైసెన్స్ కోరే కంపెనీల్లోనే 74 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే, ఇకపై పాత లైసెన్స్‌లు ఉన్న కంపెనీల్లో కూడా ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే నేరుగా 74 శాతం వరకు పెట్టుబడులు పెట్టేలా వెసులుబాటు కల్పించబోతున్నారు. దీనివల్ల విదేశీ భాగస్వాములకు భారతీయ కంపెనీల్లో మెజారిటీ వాటా పొందే అవకాశం లభిస్తుంది.
కొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్న భారత్
గతంలో 74 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులు రావాలంటే మోడ్రన్ టెక్నాలజీ తీసుకురావాలనే కఠినమైన షరతు ఉండేది. అయితే ఈ షరతులో స్పష్టత లేకపోవడంతో విదేశీ కంపెనీలు వెనకాడుతున్నాయి. అందుకే ఈ నిబంధనను కూడా తొలగించి, పెట్టుబడుల ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రక్షణ ఎగుమతులపై దృష్టి సారించే కంపెనీలు తమ నిర్వహణ, సపోర్ట్ సేవలను అవుట్‌సోర్స్ చేసుకునేలా నిబంధనలు మార్చనున్నారు. తద్వారా విదేశీ కంపెనీలు భారత్ ను తమ ఎగుమతుల హబ్‌గా మార్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
ఆయుధాల దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా..
గత 25 ఏళ్లలో భారత్‌కు వచ్చిన మొత్తం ఎఫ్ డీఐ 765 బిలియన్ డాలర్లు కాగా, అందులో రక్షణ రంగం వాటా కేవలం 26.5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే 2029 నాటికి రక్షణ ఉత్పత్తుల దేశీయ తయారీని 33.25 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు 12 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 2.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న ముద్రను చెరిపేసి, ప్రపంచానికి ఆయుధాలను అమ్మే శక్తిగా భారత్ ఎదగబోతోంది.