IndiGo : ఇండిగోపై డీజీసీఏ కొరడా.. భారీ జరిమానా ఎందుకు విధించారు?
భారీ జరిమానా ఎందుకు విధించారు?
IndiGo : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్య తీసుకుంది. పైలట్ల ట్రైనింగులో లోపాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో డీజీసీఏ ఇండిగోపై రూ. 20 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ ఆదేశాన్ని అప్పీలేట్ అథారిటీ ముందు సవాలు చేయాలని యోచిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ఇండిగో ట్రైనింగ్ రికార్డులను తనిఖీ చేసినప్పుడు తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. ఈ చర్య విమానయాన భద్రత విషయంలో డీజీసీఏ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలియజేస్తుంది.
అసలు కేసు ఏమిటి?
ఇండిగో పైలట్లకు ఇచ్చిన ట్రైనింగ్ రికార్డులను డీజీసీఏ పరిశీలించినప్పుడు ఈ లోపాలు వెలుగు చూశాయి. సుమారు 1,700 మంది పైలట్‌లు (పైలట్-ఇన్-కమాండ్, ఫస్ట్ ఆఫీసర్స్‌తో సహా) ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్ ద్వారా పొందిన ట్రైనింగ్, అధిక ప్రమాదం ఉన్న విమానాశ్రయాలలో ల్యాండింగ్ చేయడానికి ధృవీకరించబడలేదు.
కేటగిరీ C కిందకు వచ్చే కోజికోడ్, లేహ్, కాట్మాండు వంటి విమానాశ్రయాలను అధిక-ప్రమాదకర కేటగిరీలో ఉంచారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, రన్‌వే పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అత్యంత సవాలుగా ఉంటాయి. ఈ హై రిస్క్ విమానాశ్రయాలకు నిర్దేశించిన ట్రైనింగ్ ప్రమాణాలను పాటించడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ పేర్కొంది. పైలట్ల శిక్షణకు సరైన సిమ్యులేటర్లను ఉపయోగించకపోవడం వల్లే ఈ జరిమానా విధించారు. దీంతో డీజీసీఏ ఇండిగోపై రూ. 20 లక్షల జరిమానా విధించి, ట్రైనింగు ప్రాసెస్ లో తక్షణమే మెరుగుదలలు తీసుకురావాలని ఆదేశించింది.
ఇండిగో స్పందన
ఈ జరిమానాకు సంబంధించి సెప్టెంబర్ 26న డీజీసీఏ నుండి నోటీసు అందినట్లు ఇండిగో బుధవారం స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. అంతర్గత కమ్యూనికేషన్‌లో ఆలస్యం కారణంగా ఈ సమాచారాన్ని బహిరంగపరచడంలో జాప్యం జరిగిందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఆదేశం తమ ఆర్థిక పరిస్థితి, కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. తమ విమానాలను అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఇండిగో తెలిపింది.
ఇంతకుముందు కూడా చర్యలు
డీజీసీఏ ఇండిగోపై చర్య తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2023లో కూడా ఎయిర్‌లైన్‌పై రెగ్యులేటర్ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఆ సమయంలో నిర్వహించిన ప్రత్యేక ఆడిట్‌లో కంపెనీ ఆపరేషన్స్, శిక్షణ, ఇంజనీరింగ్ విభాగాలలో అనేక లోపాలు కనుగొంది.