SIP Investment Plan : రూ.5 కోట్ల కార్పస్ కావాలా? SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి ?

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి ?

Update: 2025-11-18 06:01 GMT

SIP Investment Plan : డబ్బు సంపాదించడంతో పాటు మంచి రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల కోసం ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. మార్కెట్‌లో అనేక ఆప్షన్లు ఉన్నప్పటికీ తమ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే వాటిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా కోట్లాది రూపాయల నిధిని సృష్టించుకోవాలని ప్లాన్ చేస్తుంటే, మ్యూచువల్ ఫండ్స్‎లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎస్‌ఐపీ ద్వారా మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే దీనిలో మీరు పెట్టిన డబ్బుపై వచ్చే వడ్డీకి కూడా మళ్లీ వడ్డీ కలుస్తుంది. దీన్నే కాంపౌండింగ్ అంటారు. మీరు 30 ఏళ్లలో ఏకంగా రూ.5 కోట్ల కార్పస్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

సిప్ ద్వారా 5 కోట్ల రూపాయల ఫండ్‌ను సృష్టించాలంటే, మొదటగా మీరు సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి. మార్కెట్‌లో స్థిరంగా ఏడాదికి 12 శాతం రాబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న ఫండ్‌ను ఎంచుకోవడం తెలివైన పని. కొన్ని ఫండ్‌లు దీనికంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఇస్తాయి.. కానీ లెక్క సులభంగా అర్థం చేసుకోవడం కోసం మనం సగటున 12 శాతం రిటర్న్‌ను ఉదాహరణగా తీసుకుందాం. మీరు నెలకు రూ.15,000 చొప్పున పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాలి. ఈ పెట్టుబడిని మీరు 30 సంవత్సరాల పాటు కొనసాగించాలి. దీనిపై సగటున 12 శాతం వార్షిక రాబడి లభిస్తే, 30 ఏళ్ల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ.5 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది.

ఈ రూ.5 కోట్ల ఫండ్‌లో మీ సొంత పెట్టుబడి ఎంత, వడ్డీ రూపంలో ఎంత వచ్చిందో చూస్తే కాంపౌండింగ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. 30 ఏళ్లలో మీరు మొత్తం పెట్టిన సొంత పెట్టుబడి రూ.54,00,000 మాత్రమే అవుతుంది. మిగిలిన రూ.4,75,48,707 (4.75కోట్లకు పైగా) మొత్తం మీకు కేవలం వడ్డీ రూపంలో మాత్రమే వచ్చి చేరుతుంది. అంటే మీరు కేవలం 54 లక్షలు పెట్టుబడి పెడితే దానికి దాదాపు నాలుగున్న కోట్లకు పైగా అదనంగా వడ్డీ కలిసి మీ మొత్తం సంపదను ఐదు కోట్ల మార్క్‌కు చేరుస్తుంది. అందుకే ఎస్‌ఐపీలో దీర్ఘకాలికంగా ఉండటం చాలా ముఖ్యం.

సిప్ అనేది మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కాబట్టి, మీకు వచ్చే రాబడి అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం, లేదా తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారు నుంచి సూచనలు తీసుకుని మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

Tags:    

Similar News