Elon Musk : 500 బిలియన్ డాలర్ల సంపద దాటిన తొలి వ్యక్తి.. చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్

చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్

Update: 2025-10-02 07:11 GMT

Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 500 బిలియన్ డాలర్ల (దాదాపు 41 లక్షల కోట్ల రూపాయలు) నికర ఆస్తిని కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. టెస్లా షేర్ల ధరలు పెరగడం వల్లే మస్క్ సంపద ఈ అసాధారణ మైలురాయిని చేరుకుంది. గతంలో 300 బిలియన్ డాలర్లు, 400 బిలియన్ డాలర్ల మార్కును దాటిన మొదటి వ్యక్తి కూడా మస్కే కావడం విశేషం.

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. టెస్లా షేర్ల ధరలు బుధవారం రోజు అత్యధిక స్థాయికి చేరుకున్నప్పుడు ఎలన్ మస్క్ నికర ఆస్తి తొలిసారిగా $500 బిలియన్ (సుమారు రూ.41 లక్షల కోట్లు) మార్కును తాకింది. రియల్ టైమ్ ప్రాతిపదికన బిలియనీర్ల సంపదను ట్రాక్ చేసే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మార్కెట్ ముగిసిన తర్వాత మస్క్ నికర ఆస్తి స్వల్పంగా తగ్గినా, అది 500 బిలియన్‌ డాలర్లకు చాలా దగ్గరగా ఉంది. గురువారం కూడా టెస్లా షేర్ల ధరలు పెరిగితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 300 బిలియన్ డాలర్ల మార్కును ఇప్పటివరకు మస్క్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ మాత్రమే దాటగలిగారు.

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, బుధవారం ఒక్కరోజే ఎలన్ మస్క్ నికర ఆస్తి 8.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 499.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. మస్క్ సంపదలో అసలైన పెరుగుదల 2020 నుండి మొదలైంది. 2020లో ఫోర్బ్స్ ప్రకారం నికర ఆస్తి సుమారు 25 బిలియన్ డాలర్లుగా ఉంది. కేవలం ఐదు సంవత్సరాలలో ఆయన సంపద ఏకంగా 20 రెట్లు పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే కాలంలో ఎలన్ మస్క్ సంపద మరింత పెరిగే అవకాశం ఉంది.

బుధవారం నాడు టెస్లా షేర్లు 3 శాతం కంటే ఎక్కువ పెరగడంతో ఎలన్ మస్క్ సంపద ఈ చారిత్రక స్థాయిని తాకింది. ఆ రోజు టెస్లా షేరు ధర 3.31 శాతం పెరిగి 459.46 డాలర్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో షేరు 462.29డాలర్ల మార్కును కూడా తాకింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, త్వరలోనే కంపెనీ షేర్లు 500డాలర్ల మార్కును కూడా దాటవచ్చు.

ఈ సంవత్సరం టెస్లా షేర్ ధర ఇప్పటికే 21 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయన నిష్క్రమించినప్పటి నుంచి టెస్లా షేర్ ధర 100 శాతం కంటే ఎక్కువ పెరగడం గమనార్హం. ఏప్రిల్ 8న 221.86డాలర్ల వద్ద ఉన్న షేరు ధర అప్పటి నుండి 107 శాతం వృద్ధిని సాధించింది.

Tags:    

Similar News