EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు బంపర్ ఆఫర్..ఇక పీఎఫ్ జీతం పెరగడం ఖాయం
ఇక పీఎఫ్ జీతం పెరగడం ఖాయం
EPFO : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న లక్షలాది మందికి సుప్రీంకోర్టు ఒక తీపి కబురు అందించింది. గత 11 ఏళ్లుగా మారని ఈపీఎఫ్‌ఓ జీతపు పరిమితిని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా పీఎఫ్ నిబంధనల్లో మార్పులు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగుల పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.
గత దశాబ్ద కాలంలో ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కానీ, ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం తప్పనిసరి పీఎఫ్ పరిమితి మాత్రం 2014 నుంచి రూ.15,000 దగ్గరే ఆగిపోయింది. దీనిపై దాఖలైన ఒక ప్రజాహిత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నేటి కాలంలో అనేక రాష్ట్రాల్లో కనీస వేతనమే రూ.15 వేల కంటే ఎక్కువగా ఉందని గుర్తు చేసింది. మరి అటువంటప్పుడు పీఎఫ్ సీలింగ్ ఇంకా పాత ధరల వద్దే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై రాబోయే నాలుగు నెలల్లోగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
చివరిసారిగా 2014లో పీఎఫ్ జీతపు పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దానిపై ఎలాంటి సవరణలు జరగలేదు. నేడు ఒక సామాన్య కార్మికుడికి కూడా నెలకు రూ.15 వేలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ పరిమితి తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఉద్యోగులు సామాజిక భద్రతా వలయం నుంచి బయట ఉండిపోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పిటిషనర్ రెండు వారాల్లోగా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనున్నారు. దీని ఆధారంగా కేంద్రం తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జీతపు పరిమితిని రూ.21,000 లేదా రూ.25,000కు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు కలిగే లాభం ఏంటంటే.. ఇప్పటివరకు నెలకు కేవలం రూ.1,250 మాత్రమే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఖాతాకు జమ అవుతోంది. ఒకవేళ సీలింగ్ రూ.25,000కు పెరిగితే, నెలకు దాదాపు రూ.2,083 మీ పెన్షన్ ఖాతాకు చేరుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ.10,000 అదనంగా మీ రిటైర్మెంట్ నిధిలో జమ అవుతాయి. ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు భారీ ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎఫ్‌ఓను మరింత ఆధునీకరించాలని భావిస్తోంది. EPFO 3.0 పేరుతో మరింత మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ నిర్ణయం వల్ల కంపెనీలపై కొంత అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగి పెన్షన్ ఫండ్‌లో కంపెనీలు కూడా తమ వంతు వాటాను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా, సుప్రీంకోర్టు జోక్యంతో ప్రైవేట్ ఉద్యోగుల రిటైర్మెంట్ లైఫ్ మరింత సురక్షితంగా మారబోతోందన్నది వాస్తవం.