PM-KMY : రైతులకు డబుల్ బెనిఫిట్.. నెలకు రూ.3000 పెన్షన్

నెలకు రూ.3000 పెన్షన్;

Update: 2025-08-06 12:03 GMT

PM-KMY : ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదు చేసుకున్న రైతులైతే వారికోసం ప్రభుత్వం మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ పెన్షన్ యోజనను పీఎం కిసాన్ తో అనుసంధానం చేశారు. దీనివల్ల వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. దీనికోసం రైతులు తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ పెన్షన్‌కు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం, నేరుగా పీఎం కిసాన్ ద్వారా వచ్చే సంవత్సరానికి రూ.6,000 సహాయం నుంచి తీసేస్తారు.

పీఎం కిసాన్ మాన్‌ధన్ పెన్షన్ యోజనలో చేరడానికి రైతు వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కసారి ఈ పథకంలో నమోదు చేసుకుంటే, 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల రూ.3,000 పెన్షన్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఈ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక ప్రత్యేక పెన్షన్ ఐడీ నంబర్‌ను ఇస్తుంది.

ఈ పథకంలో చేరడం చాలా సులభం. రైతులు తమ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్తే సరిపోతుంది. అక్కడ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. సీఎస్సీ ఆపరేటర్ ఈ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఆటో-డెబిట్ ఫారమ్ నింపుతారు. మీరు ఇప్పటికే పీఎం కిసాన్ లబ్ధిదారులైతే మీ వాటా మొత్తం ఆ పథకం నుంచి వచ్చే సహాయం నుంచే కట్ అవుతుంది.

ఈ పథకం గొప్ప విషయం ఏమిటంటే, రైతులు తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ఒక రైతు 40 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే, అతను నెలకు గరిష్టంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి రూ.2,400. ఈ మొత్తం నేరుగా పీఎం కిసాన్ సహాయం నుంచి కట్ అవుతుంది. ఇంకా మిగిలిన రూ.3,600 రైతు ఖాతాలో జమ అవుతుంది. ఇలా చేయడం వల్ల రైతులకు రెండు లాభాలు లభిస్తాయి. ఒకటి, ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం, రెండు, వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ గ్యారంటీ.

Tags:    

Similar News