Fastag : ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రికార్డు.. లాంచ్ అయిన మొదటి రోజే లక్షల్లో బుకింగ్‌లు
లాంచ్ అయిన మొదటి రోజే లక్షల్లో బుకింగ్‌లు;
Fastag : భారతదేశంలో టోల్ కలెక్షన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్, ఇప్పుడు మరో ముందడుగు వేసింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. అదే ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్. ఈ కొత్త పాస్ వినియోగదారుల నుంచి మొదటి రోజే అద్భుతమైన స్పందన పొందింది. ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన బుకింగ్‌లు భారీగా జరిగాయి.
లాంచ్ అయిన మొదటి రోజునే లక్షల్లో బుకింగ్‌లు
స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15, 2025న ప్రారంభమైన ఈ యాన్యువల్ పాస్ సేవకు అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకు, సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతేకాకుండా, టోల్ ప్లాజాల వద్ద దాదాపు 1.39 లక్షల లావాదేవీలు కూడా నమోదయ్యాయి. ఈ పాస్ తీసుకున్న వినియోగదారులకు టోల్ ఛార్జీలు డెబిట్ కాలేదని తెలియజేస్తూ ఎస్ఎంఎస్ కూడా వచ్చాయి. దీనికి తోడు దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది వినియోగదారులు రాజ్‌మార్గ యాత్ర యాప్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నారు.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ అంటే ఏమిటి?
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ అనేది ఒక వార్షిక టోల్ పాస్. ఇది ఒక సంవత్సరం పాటు లేదా గరిష్టంగా 200 ట్రిప్‌ల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. దీని ధర రూ. 3,000గా నిర్ణయించారు. ఈ పాస్ ద్వారా మీరు దేశంలోని సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు లేకుండా ప్రయాణించవచ్చు.
ఎలా పొందాలి? ప్రయోజనాలు ఏమిటి?
ఈ యాన్యువల్ పాస్‌ను ఆన్‌లైన్‌లోనే సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీరు NHAI అధికారిక వెబ్‌సైట్ లేదా రాజ్‌మార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా దీనిని పొందవచ్చు. ఈ సేవ ప్రస్తుతం కారు, జీప్, వ్యాన్ వంటి వ్యక్తిగత వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఈ పాస్ ఉన్నవారికి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా, NHAI అధికారులు, నోడల్ అధికారులు అందుబాటులో ఉన్నారు. అలాగే, ఏమైనా సమస్యలు ఎదురైతే, 1033 జాతీయ రహదారి హెల్ప్‌లైన్‌ను మరింత బలోపేతం చేశారు.
ఫాస్ట్‌ట్యాగ్ విప్లవం
ప్రస్తుతం దేశంలో 8 కోట్ల మందికి పైగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు ఉన్నారు. 98% టోల్ కలెక్షన్ ఫాస్ట్‌ట్యాగ్ ద్వారానే జరుగుతోంది. ఈ కొత్త యాన్యువల్ పాస్ రాకతో, టోల్ ప్లాజాల వద్ద డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు, ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా మారనుంది.