TCS : టీసీఎస్‌లో నోటీసు లేకుండానే వేల సంఖ్యలో ఉద్యోగాల తొలగింపు.. బిక్కుబిక్కుమంటున్న ఉద్యోగులు
బిక్కుబిక్కుమంటున్న ఉద్యోగులు
TCS : దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) లో ప్రస్తుతం వేల సంఖ్యలో ఉద్యోగులు తొలగించబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగులను బయటకు పంపేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట 2% (సుమారు 12,000 మంది) ఉద్యోగులను తొలగిస్తామని చెప్పినప్పటికీ, వాస్తవ సంఖ్య 30,000కు పైగా ఉండవచ్చని ఉద్యోగులు, ఐటీ యూనియన్లు చెబుతున్నాయి.
పదేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు కూడా ఈ తొలగింపుల బారిన పడుతున్నారు. ప్రాజెక్ట్‌లు లేవనే సాకుతో, లేదా తప్పుడు ఆరోపణలు చేసి, బలవంతంగా రాజీనామా చేయమని కోరుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. రాజీనామా చేయకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. దీని వల్ల చాలా మంది భయంతో పనిచేస్తున్నారు.
కొంతమంది ఉద్యోగులు కంపెనీలో ఫ్లూయిడిటీ లిస్ట్ అనే జాబితా ఉందని, ఇందులో ఉన్నవారిని తొలగించడానికి కారణాలు లేకుండానే ప్రాజెక్ట్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. జూన్ 2025లో వచ్చిన కొత్త పాలసీ ప్రకారం, ఉద్యోగులు సంవత్సరానికి కనీసం 225 రోజులు ప్రాజెక్ట్‌లో యాక్టివ్‌గా ఉండాలి, లేదంటే ఉద్యోగంపై ప్రభావం పడుతుంది. ఇది ఉద్యోగుల్లో మరింత ఆందోళనను పెంచింది.
FITE, UNITE వంటి ఐటీ యూనియన్లు టీసీఎస్ అక్రమంగా ఉద్యోగులను తొలగిస్తోందని తీవ్రంగా ఖండించాయి. దీనిపై టీసీఎస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అక్టోబర్ 9న కంపెనీ త్రైమాసిక ఫలితాలతో పాటు ఈ విషయంపై స్పష్టత ఇస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.