Sunil Galgotia : పుస్తకాలు అమ్మే స్థాయి నుంచి యూనివర్సిటీ ఓనర్ వరకు..ఈయన సక్సెస్ స్టోరీ మాములుగా ఉండదు

ఈయన సక్సెస్ స్టోరీ మాములుగా ఉండదు

Update: 2026-02-19 06:31 GMT

Sunil Galgotia : ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గల్గోటియాస్ యూనివర్సిటీ పేరు తెలియని వారుండరు. ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ సామ్రాజ్యం వెనుక ఒక సామాన్య పుస్తకాల షాపు యజమాని అసాధారణ పోరాటం ఉంది. కేవలం ఒక బుక్ స్టోర్‌తో మొదలైన ప్రయాణం, నేడు రూ.3,000 కోట్ల విద్యా సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనే సునీల్ గల్గోటియా. ఇటీవల ఈ యూనివర్సిటీ ఒక రోబో డాగ్ వివాదంలో చిక్కుకున్నప్పటికీ, దాని వ్యవస్థాపకుడి సక్సెస్ స్టోరీ మాత్రం ఎందరికో స్ఫూర్తిదాయకం.

గల్గోటియా కుటుంబం ప్రస్థానం 1930లో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ప్రారంభమైంది. అక్కడ ఈడీ గల్గోటియా అండ్ సన్స్ పేరుతో వారికి ఒక చిన్న పుస్తకాల దుకాణం ఉండేది. ఆ వ్యాపారాన్ని సునీల్ గల్గోటియా తన చేతుల్లోకి తీసుకున్న తర్వాతే అసలు మలుపు తిరిగింది. 1980వ దశకంలో ఆయన గల్గోటియా పబ్లికేషన్స్‎ను ప్రారంభించారు. తన మొదటి పుస్తకాన్ని ప్రచురించడానికి ఆయన వద్ద తగినంత డబ్బు కూడా లేదు. కేవలం 9,000 రూపాయలు అప్పుగా తీసుకుని పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ స్టెబిలిటీ అనే పుస్తకాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధ SAT, GRE, GMAT వంటి పుస్తకాల పంపిణీ హక్కులను సాధించడంతో ఆయన వ్యాపారం ఊపందుకుంది.

పుస్తక వ్యాపారంలో నిలదొక్కుకున్నాక, విద్యా రంగంలోకి అడుగుపెట్టాలని సునీల్ నిర్ణయించుకున్నారు. 2000వ సంవత్సరంలో కేవలం 40 మంది విద్యార్థులతో గల్గోటియాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ, చివరకు 2011లో గ్రేటర్ నోయిడాలో భారీ విస్తీర్ణంలో గల్గోటియాస్ యూనివర్సిటీని నిర్మించారు. నేడు ఈ యూనివర్సిటీలో 40 దేశాలకు చెందిన సుమారు 40,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. లక్ష మందికి పైగా పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా 96 దేశాల్లో స్థిరపడటం ఈ సంస్థ సాధించిన అతిపెద్ద విజయం.

ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పగ్గాలను సునీల్ కుమారుడు ధృవ్ గల్గోటియా నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్‎లో ప్రదర్శించిన ఒక రోబో డాగ్ వివాదానికి కేంద్రబిందువైంది. తమ విద్యార్థులే దీన్ని తయారు చేశారని యూనివర్సిటీ ప్రకటించగా, అది చైనా నుంచి కొనుగోలు చేసిన ప్రోడక్ట్ అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ వివాదం పక్కన పెడితే, ఒక చిన్న అప్పుతో మొదలై, మూడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సునీల్ గల్గోటియా ప్రస్థానం మాత్రం భారతీయ విద్యా రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News