Financial Changes : యూపీఐ లిమిట్ నుండి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి ఈ కొత్త రూల్స్

నేటి నుంచి ఈ కొత్త రూల్స్;

Update: 2025-08-01 02:11 GMT

Financial Changes : ఆగస్టు నెల నుండి దేశ ఆర్థిక రంగంలో పలు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు మీ రోజువారీ లావాదేవీలు, ప్రయాణాలు, గృహ ఖర్చులు, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ నెలలో అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనలలో యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త రూల్స్, ఎల్‌పీజీ దర, సీఎన్‌జీ ధరల మార్పు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై లభించే ఉచిత బీమా కవరేజ్ రద్దు, ఇంకా ఫాస్టాగ్ వార్షిక పాస్ వంటివి ఉన్నాయి.

1. యూపీఐలో కొత్త రూల్స్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ లావాదేవీల నాణ్యతను మెరుగుపరచడానికి, సర్వర్ ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేసింది. ఆగస్టు 1 నుండి ఈ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఒక యూపీఐ యాప్‌లో ఒక రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. తరచుగా బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోందని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ఒక మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన అన్ని బ్యాంక్ ఖాతాల జాబితాను ఒక రోజులో 25 సార్లు మాత్రమే చూసేందుకు వీలుంటుంది. ఆటోపే లావాదేవీలను ఇకపై పీక్ అవర్స్‌లో ప్రాసెస్ చేయరు. దీనికోసం ప్రత్యేక టైమ్ స్లాట్‌లు ఉంటాయి. ఇకపై యూపీఐ లావాదేవీలు చేసేటప్పుడు లబ్దిదారుని పేరు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల తప్పుడు ఖాతాకు డబ్బు పంపే ప్రమాదం తగ్గుతుంది.

2. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మార్పులు

ఆగస్టు 11, 2025 నుండి, ఎస్‌బీఐ కార్డ్ కొన్ని కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని రద్దు చేయనుంది. దీని వల్ల ELITE, PRIME వంటి ప్రీమియం కార్డులు, కొన్ని ప్లాటినం కార్డులు ఉన్న కస్టమర్లు ప్రభావితమవుతారు. గతంలో ఈ కార్డులపై అదనపు ప్రయోజనంగా లభించిన రూ.50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదు.

3. LPG, CNG ధరల మార్పులు

చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఎల్‌పిజి, సిఎన్‌జి, పిఎన్‌జి, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధరలను సమీక్షిస్తాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించారు. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాలకు కొంత ఊరట ఇస్తుంది. గృహ వినియోగదారుల కోసం ఎల్‌పీజీ సిలిండర్ ధరలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

4. ఫాస్టాగ్ వార్షిక పాస్

ఆగస్టు 15, 2025 నుండి ప్రైవేట్ వాహనాల యజమానుల కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి వస్తుంది. ఈ పాస్ ధర రూ.3,000. ఇది ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ లావాదేవీల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి ఇది ఆర్థికంగా మరియు సౌకర్యవంతమైన ఎంపిక. ఈ పాస్‌ను తీసుకోవడం తప్పనిసరి కాదు, పాత పద్ధతిలోనే ఫాస్టాగ్‌ను వాడుకోవచ్చు.

5. RBI MPC సమావేశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఆగస్టు మొదటి వారంలో, ఆగస్టు 4 నుండి 6 వరకు జరగనుంది. గత మూడు సమావేశాల్లో రెపో రేటును తగ్గించిన ఆర్‌బిఐ, ఈసారి కూడా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే గృహ, వాహన రుణాల ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News