G-RAM-G Act : 100 రోజులు పాత మోడల్..ఇకపై ఏటా 125 రోజులు పని గ్యారెంటీ

ఇకపై ఏటా 125 రోజులు పని గ్యారెంటీ

Update: 2026-01-10 08:33 GMT

G-RAM-G Act : గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం జి-రామ్-జి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. 2011-12లో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం, 2023-24 నాటికి 4.86 శాతానికి పడిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. గతంలో ఏడాదికి 100 రోజుల పని దినాలు ఉంటే, ఇప్పుడు వాటిని 125 రోజులకు పెంచారు. అంటే కూలీలకు మరింత ఆదాయం లభిస్తుంది.

ఈ చట్టంలో అత్యంత కీలకమైన అంశం 60 రోజుల విరామ సమయం. సాగు పనులు ముమ్మరంగా సాగే సీజన్‌లో కూలీల కొరత లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంట బిత్తడం లేదా కోతల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 60 రోజుల విరామాన్ని ఎప్పుడు ప్రకటించాలో నిర్ణయిస్తాయి. దీనివల్ల కూలీలు తమ సొంత వ్యవసాయ పనులు చేసుకోవడానికి లేదా స్థానికంగా రైతులకు సహాయపడటానికి అవకాశం ఉంటుంది.

బయోమెట్రిక్ హాజరు గతంలో ఉపాధి హామీ పథకంలో మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉండేది. చనిపోయిన వారి పేరు మీద లేదా వలస వెళ్ళిన వారి పేరు మీద దొంగ కార్డులు సృష్టించి డబ్బులు నొక్కేసేవారు. దీనికి చెక్ పెట్టేందుకు ఇకపై బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. ఎవరైతే పనికి వస్తారో వారి వేలిముద్ర పడితేనే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ ద్వారా డబ్బులు జమ అవుతాయి. దీనివల్ల అవినీతికి తావు లేకుండా పోతుంది.

ఒక కూలీ పని కావాలని అడిగిన 15 రోజుల్లోగా ప్రభుత్వం పని కల్పించలేకపోతే, ఆ కూలీకి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. అంటే పని ఉన్నా లేకపోయినా కూలీకి భద్రత ఉంటుంది. అలాగే వేతనాలు కూడా ప్రస్తుతమున్న ధరల కంటే తగ్గకుండా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెరిగేలా చట్టంలో నిబంధనలు చేర్చారు. ప్రధాన మంత్రి గతి శక్తి ప్లాన్‌తో ఈ పథకాన్ని అనుసంధానించడం వల్ల గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా సాగనుంది.

Tags:    

Similar News