LPG Price : పండుగ వేళ ఆశగా ఎదురు చూసిన సామాన్యుడికి షాక్
ఎదురు చూసిన సామాన్యుడికి షాక్
LPG Price : పండగల సీజన్ వచ్చేసింది. ఈ పండుగల సందర్భంగా ప్రభుత్వం కొన్ని రంగాల్లో ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. ముఖ్యంగా గృహోపకరణాల ధరలపై జీఎస్టీని తగ్గించి సామాన్యుల జేబుపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రం తగ్గించలేదు. ఏప్రిల్ 8 తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. నవరాత్రులు, దసరా, ఆ తర్వాత దీపావళి పండుగల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని ప్రజలు ఎంతో ఆశించారు. కానీ వారి ఆశలు నిరాశగా మారాయి.
ఈసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఏప్రిల్ 8, 2025న ధరలు పెరిగిన తర్వాత అప్‌డేట్ అయిన రేట్లే దీపావళి ముందు కూడా కొనసాగుతున్నాయి. ఆ రోజున గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచారు. ప్రస్తుతం, ఐఓసీఎల్ నివేదిక ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల దిగుమతులు ఖరీదుగా మారడమే ధరలు పెరగకపోవడానికి ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు.
గృహ వినియోగ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో రూ.15.50 పెరిగి రూ.1,595.50 కి చేరింది. కోల్‌కతాలో రూ.16.5 పెరిగి రూ.1,700.50, ముంబైలో రూ.15.5 పెరిగి రూ.1,547, చెన్నైలో రూ.16.5 పెరిగి రూ.1,754.5 కి చేరాయి. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా, పండగల సీజన్‌లో సామాన్యులు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని ఆశించినప్పటికీ, గృహ వినియోగ సిలిండర్ల విషయంలో అలాంటి ఊరట లభించలేదు. అయితే, వాణిజ్య సిలిండర్ల ధరలు మాత్రం పెరగడం వ్యాపారులకు కొంత భారంగా మారింది.