Gold Loan : బంగారం తాకట్టులో కొత్త ట్రెండ్.. ఐదు లక్షల కంటే ఎక్కువ లోన్లకే మొగ్గు

ఐదు లక్షల కంటే ఎక్కువ లోన్లకే మొగ్గు

Update: 2026-03-03 09:04 GMT

Gold Loan : భారతదేశంలో బంగారం తాకట్టు పెట్టడం అంటే ఒకప్పుడు ఏదో ఆపద వచ్చిందని, కష్టాల్లో ఉన్నారని అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గోల్డ్ లోన్ అనేది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్‌గా, వ్యాపార పెట్టుబడులకు ప్రధాన వనరుగా మారిపోయింది. సామాన్యులే కాదు, ఇప్పుడు ధనవంతులు కూడా తమ ఇంట్లోని నగలను బ్యాంకుల్లో పెట్టి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ మార్కెట్ ఒక చారిత్రాత్మక మార్పుకు లోనవుతోంది. ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ తీసుకునే రుణాల సంఖ్య భారీగా పెరగడమే దీనికి నిదర్శనం.

క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన డేటా ప్రకారం.. డిసెంబర్ 2025 చివరి నాటికి, రూ.5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న గోల్డ్ లోన్ల వాటా రెండేళ్ల క్రితం ఉన్న 17.7 శాతం నుంచి ఏకంగా 36.5 శాతానికి పెరిగింది. అంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ అన్నమాట. అదేవిధంగా రూ.లక్ష కంటే తక్కువ తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతంలో చిన్న చిన్న అవసరాల కోసం నగలు తాకట్టు పెట్టేవారు, ఇప్పుడు బిజినెస్ విస్తరణకు లేదా కొత్త ఇన్వెస్ట్‌మెంట్ల కోసం భారీ మొత్తంలో లోన్లు తీసుకుంటున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి. సంపన్న వర్గాల్లో గోల్డ్ లోన్ల పట్ల ఉన్న మొహమాటం ఇప్పుడు పూర్తిగా తొలిగిపోయింది.

మరో క్రెడిట్ స్కోర్ కంపెనీ ఎక్స్‌పీరియన్ విశ్లేషణ ప్రకారం.. రూ.3 లక్షల కంటే ఎక్కువ తీసుకునే రుణాల వాటా గతేడాది 44 శాతం ఉండగా, ఇప్పుడు అది 56 శాతానికి చేరింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద ఉన్న మొత్తం గోల్డ్ లోన్ విలువ ఏడాదికి 44 శాతం పెరిగి రూ. 16.1 లక్షల కోట్లకు చేరింది. భారత రిటైల్ లోన్ మార్కెట్‌లో ఇప్పుడు గోల్డ్ లోన్ల వాటా 10 శాతంగా ఉంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. బంగారం విలువ పెరగడం వల్ల తక్కువ నగలతోనే ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం కలుగుతోంది.

రాష్ట్రాల వారీగా చూస్తే, గోల్డ్ లోన్ తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్ 68 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ (56 శాతం), తెలంగాణ (55 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం మీద ఉన్న మక్కువ, ఇక్కడి వ్యాపార అవసరాలు గోల్డ్ లోన్ల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. కేరళ వంటి రాష్ట్రాల్లో లోన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ లోన్ తిరిగి చెల్లించని రిస్క్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ ఈ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, గోల్డ్ లోన్‌పై దృష్టి పెట్టే ఎన్‌బీఎఫ్‌సీల దూకుడు పెరిగింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పర్సనల్ లోన్ల వంటి అన్‌సెక్యూర్డ్ లోన్ల కంటే గోల్డ్ లోన్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం మరియు తక్కువ సమయంలోనే లోన్ మంజూరు కావడం. ఆర్‌బీఐ నిబంధనలు కూడా బ్రాంచ్ నెట్‌వర్క్ పెంచుకోవడానికి వీలుగా ఉండటంతో రాబోయే రోజుల్లో గోల్డ్ లోన్ మార్కెట్ మరింత పుంజుకోనుంది. ఒకప్పుడు అప్పుగా భావించిన బంగారం, ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఒక ఫైనాన్సింగ్ టూల్ గా మారిపోయింది.

Tags:    

Similar News