PMFBY : గుడ్ న్యూస్.. నేడు 30లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.3200కోట్లు
నేడు 30లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.3200కోట్లు
PMFBY : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రూ. 3,200 కోట్ల పంట బీమా క్లెయిమ్ మొత్తాన్ని డిజిటల్‌గా వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, రాజస్థాన్ వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా కూడా పాల్గొంటారు.
ఈ మొత్తం రూ. 3,200 కోట్లలో అధిక శాతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులకు అందనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రైతులకు రూ. 1,156 కోట్లు, రాజస్థాన్ రాష్ట్రంలోని 7 లక్షల మంది రైతులకు రూ. 1,121 కోట్లు, ఛత్తీస్‌గఢ్ రైతులకు రూ. 150 కోట్లు, మిగిలిన రూ. 773 కోట్లు ఇతర రాష్ట్రాల రైతులకు పంపిణీ చేస్తారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకమైనది.
రైతులకు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రీమియం వాటాను చెల్లించడం ఆలస్యమైనా, కేంద్ర ప్రభుత్వం తన సబ్సిడీ ఆధారంగా రైతులకు క్లెయిమ్‌ను చెల్లించవచ్చు. ఇది రైతులకు త్వరగా సహాయం అందేలా చేస్తుంది.
ఈ పథకంలో జాప్యం జరగకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఖరీఫ్ 2025 సీజన్ నుంచి, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం వాటా చెల్లింపులో ఆలస్యం చేస్తే, దానిపై 12 శాతం పెనాల్టీ విధిస్తారు. అదే విధంగా, బీమా కంపెనీలు రైతులకు పరిహారం చెల్లించడంలో ఆలస్యం చేస్తే, ఆ మొత్తంపై రైతులకు 12 శాతం పెనాల్టీతో కలిపి చెల్లిస్తారు. ఈ విధానం వల్ల రైతులకు సకాలంలో పరిహారం అందే అవకాశం ఉంది.
2016లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 1.83 లక్షల కోట్ల క్లెయిమ్‌లు పంపిణీ చేశారు. రైతులు ప్రీమియంగా చెల్లించిన మొత్తం కేవలం రూ. 35,864 కోట్లు మాత్రమే. అంటే, రైతులు చెల్లించిన ప్రీమియం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ క్లెయిమ్స్ చెల్లించినట్లు స్పష్టమవుతుంది. ఈ మధ్య కాలంలో యెస్-టెక్, విండ్స్ పోర్టల్, ఏఐడీఈ మొబైల్ యాప్, కృషి రక్షక్ పోర్టల్ వంటి కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టారు. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరగడంతో పాటు, వాతావరణ సమాచారం, గ్రామ స్థాయిలో కూడా రైతుల రిజిస్ట్రేషన్ సులభంగా జరుగుతోంది.