LPG Gas Subsidy : ఉజ్వల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ. 300కు పెంపు!

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ. 300కు పెంపు!;

Update: 2025-08-11 07:14 GMT

LPG Gas Subsidy : ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని కొనసాగించడానికి ఆమోదం లభించింది. ఈ సబ్సిడీని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. అయితే, ఈ ప్రయోజనం పొందాలంటే ఏడాదికి గరిష్టంగా 9 సార్లు మాత్రమే సిలిండర్ రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 12,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నిర్ణయం లక్షల మంది పేద కుటుంబాలకు, ముఖ్యంగా గృహిణులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది.

మన దేశం తన ఎల్పీజీ అవసరాలలో దాదాపు 60% విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే, దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది. పేద కుటుంబాలపై ఈ భారం పడకుండా చూడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 2022లో కేంద్రం ప్రతి సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీని ప్రారంభించింది. ఇప్పుడు దానిని రూ. 300కు పెంచడం వల్ల ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ మరింత చవకగా లభిస్తుంది. ఈ చర్య వల్ల వంటగ్యాస్ వినియోగం మరింత పెరుగుతుందని, తద్వారా కట్టెల పొయ్యి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఉజ్వల యోజన లబ్ధిదారులు గ్యాస్ వినియోగాన్ని పెంచారు. 2019-20లో ప్రతి లబ్ధిదారుడు ఏడాదికి సగటున 3 సార్లు రీఫిల్ చేయించుకుంటే, 2022-23లో ఇది 3.68కి, 2024-25లో దాదాపు 4.47కి పెరిగింది. ఈ గణాంకాలు లబ్ధిదారులు ఇప్పుడు గ్యాస్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి. కట్టెల పొయ్యిని వాడటం తగ్గించడం వల్ల పొగతో వచ్చే శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గాయి. ఇది మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడింది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన మే 2016లో ప్రారంభమైంది. పేద కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు ఎలాంటి అడ్వాన్స్ డబ్బులు తీసుకోకుండా ఎల్పీజీ కనెక్షన్‌లు ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 2025 జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 10.33 కోట్ల కనెక్షన్‌లు మంజూరు చేయబడ్డాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు సిలిండర్, రెగ్యులేటర్, పైపు, డీజీసీసీ బుక్‌లెట్, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఉచితంగా లభిస్తాయి. అలాగే, ఉజ్వల 2.0 పథకం కింద మొదటి రీఫిల్, ఒక స్టవ్ కూడా ఉచితంగా ఇస్తారు. ఈ అన్ని ఖర్చులను ప్రభుత్వం, చమురు కంపెనీలు కలిసి భరిస్తాయి. తద్వారా పేద కుటుంబాలు సులభంగా వంటగ్యాస్‌ను ఉపయోగించుకోగలుగుతాయి.

Tags:    

Similar News