Google : గూగుల్ కు రూ.2600కోట్ల జరిమానా.. కాలిఫోర్నియా కోర్టు తీర్పు

కాలిఫోర్నియా కోర్టు తీర్పు;

Update: 2025-07-04 12:55 GMT

Google : టెక్ దిగ్గజం గూగుల్‌కు ఒక పెద్ద లీగల్ షాక్ తగిలింది. గూగుల్ దాదాపు రూ.2,600 కోట్లు జరిమానా చెల్లించాలని కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇచ్చింది . ఈ తీర్పు శాన్ జోస్‌లోని స్టేట్ కోర్టు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అనుకూలంగా వచ్చింది. అసలు ఈ గొడవ 2019లో మొదలైంది. ఫోన్ వాడకంలో లేనప్పుడు కూడా గూగుల్, యూజర్ల ఫోన్ల నుంచి పర్మిషన్ లేకుండా డేటాను కలెక్ట్ చేస్తోందని చాలా మంది యూజర్లు గూగుల్‌పై ఆరోపణలు చేశారు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఐడిల్‌గా అంటే వాడకుండా ఉన్నప్పుడు కూడా గూగుల్ డేటాను పంపుతోంది..అందుకుంటోంది. వై-ఫై లేకపోయినా, డేటాను గూగుల్ సర్వర్‌లకు పంపేలా గూగుల్ ఫోన్‌లను సెట్ చేసింది. అంటే, యూజర్ల మొబైల్ డేటా వృధా అవుతూనే ఉంది. దాని బిల్లును యూజరే కట్టాల్సి వచ్చింది. గూగుల్ ఈ డేటాను తన డిజిటల్ యాడ్స్, లొకేషన్ మ్యాపింగ్, టార్గెటెడ్ యాడ్స్‌ను ఇంకా మెరుగుపరచడానికి వాడుకుంది.

గూగుల్ యూజర్లపై అనవసర భారం మోపిందని, దీనివల్ల యూజర్ల ప్రైవసీ, ఖర్చు రెండూ ప్రభావితం అయ్యాయని కోర్టు చెప్పింది. గూగుల్ ఇదంతా యూజర్లకు సర్వీసులు ఇవ్వడానికి కాకుండా, తన స్వంత కార్పొరేట్ లాభాల కోసం చేసిందని కోర్టు నమ్మింది. గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టనెడ మాట్లాడుతూ.. ఆండ్రాయిడ్ డివైజ్‌లు సరిగ్గా పనిచేయడానికి, వాటి భద్రతకు, విశ్వసనీయతకు ఈ డేటా బదిలీలు అవసరమని చెప్పారు. ఒక ఫోటోను పంపడం కంటే కూడా ఈ డేటా బదిలీలు తక్కువ డేటాను ఖర్చు చేస్తాయని ఆయన వివరించారు.

యూజర్లు టర్మ్స్ కండిషన్స్‌ను అంగీకరించి ఈ బదిలీలకు అనుమతి ఇచ్చారని గూగుల్ వాదించింది. అయితే, కోర్టు యూజర్ల వాదననే ముఖ్యంగా పరిగణించి, గూగుల్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసు కేవలం కాలిఫోర్నియా యూజర్లకు మాత్రమే సంబంధించింది. ఇప్పుడు అమెరికాలోని ఆండ్రాయిడ్ యూజర్లందరి కోసం ఫెడరల్ స్థాయిలో ఒక కేసు నడుస్తోంది. దాని విచారణ 2026లో మొదలవుతుంది. అక్కడ కూడా గూగుల్ దోషిగా తేలితే, దానికి ఇంకా పెద్ద జరిమానా పడవచ్చు. గతంలో కూడా గూగుల్‌పై ఇలాంటి కేసులు వచ్చాయి. పోయిన సంవత్సరం అమెరికా ప్రభుత్వం గూగుల్‌కు వ్యతిరేకంగా మోనోపాలి కేసులో గెలిచింది. గూగుల్‌ను క్రోమ్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి సేవలుగా విడగొట్టాలని ప్రభుత్వం కోరుతోంది.

Tags:    

Similar News