GST 2.0: వ్యాపారులకు ఊరట.. జీఎస్‌టీ 2.0 కింద సంచలన మార్పులు
మార్పులు
GST 2.0: దేశంలో పన్ను విధానాన్ని మరింత పారదర్శకంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జీఎస్‌టీ 2.0 రూపంలో గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సిస్టమ్ లో సంచలన మార్పులు తీసుకురాబోతోంది. బుధవారం జరగబోయే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగించే పలు కీలక ప్రతిపాదనలపై ముద్ర పడనుంది. నిలిచిపోయిన వేల కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నిధులను వ్యాపారులకు తిరిగి అందించడంతో పాటు జీఎస్‌టీ చట్టాల కింద ఉండే అనవసర అరెస్టుల భయాన్ని శాశ్వతంగా తొలగించే దిశగా అడుగులు పడుతున్నాయి.
యంత్రాలపై చెల్లించిన పన్ను ఐదేళ్లలో వాపస్
ప్లాంట్, యంత్రాలు, ఇతర సేవాలపై చెల్లించిన పన్నును ఐదేళ్ల కాలంలో నెలవారీ వాయిదాల రూపంలో వ్యాపారులకు రీఫండ్ చేసే ప్రతిపాదన కౌన్సిల్ పరిశీలనలో ఉంది. గతంలో వ్యాపారులు ఈ మొత్తాన్ని ఐటీసీ రూపంలో క్లెయిమ్ చేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడేవారు. వీటితో పాటు సెక్షన్ 17(5) కింద నిలిపివేసిన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టెలికాం టవర్లు, పైప్‌లైన్‌లు, కార్ల లీజింగ్ వంటి పలు పన్ను మినహాయింపులను మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉంది. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి వ్యయం తగ్గి, గ్లోబల్ మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది.
సప్లయర్ తప్పు చేస్తే కొనుగోలుదారుకు శిక్ష ఉండదు
ఇప్పటివరకు వ్యాపారాల మధ్య వస్తువులను సరఫరా చేసిన సప్లయర్ పన్ను కట్టకపోతే, అమాయక కొనుగోలుదారు ఐటీసీ క్రెడిట్‌ను అధికారులు నిలిపివేసేవారు. ఈ వివాదానికి జీఎస్‌టీ కౌన్సిల్ శాశ్వత పరిష్కారం చూపనుంది. వ్యాపార లావాదేవీ నిజమైనదైతే కొనుగోలుదారు ఐటీసీ హక్కును లాక్కోకుండా, ఎగవేతకు పాల్పడిన సప్లయర్ నుంచే నేరుగా పన్ను వసూలు చేస్తారు. అటు రీఫండ్ ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేస్తూ, కస్టమ్స్, ఆర్‌బీఐ ఎగుమతి డేటాను నేరుగా జీఎస్‌టీ పోర్టల్‌తో అనుసంధానించనున్నారు.
చిన్న వ్యాపారులకు భారీ మినహాయింపులు
రూ.5 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగి ఉండి, అన్‌రెజిస్టర్డ్ కస్టమర్లకు మాత్రమే సరుకులు విక్రయించే చిన్న వ్యాపారులు ఇకపై ఏడాదికి ఒక్కసారి మాత్రమే రిటర్న్లు దాఖలు చేస్తే సరిపోతుంది. నూతన జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను కేవలం మూడు పనిదినాల్లోనే ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న వ్యత్యాసాల కోసం వ్యాపారులకు అందే నోటీసులకు అడ్డుకట్ట వేస్తూ, రూ.10,000 కంటే తక్కువ బకాయిలు ఉన్న కేసులలో షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు.
ఐటీ రంగానికి ఊరట
విదేశీ బ్రాంచ్ ఆఫీసులకు అందించే సేవలను ఎగుమతులుగా పరిగణిస్తూ ఐటీ రంగానికి ఐటీసీ ప్రయోజనాలు కల్పించే దిశగా ఆలోచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తీవ్రమైన క్రిమినల్ కేసులు తప్పించి, చిన్న చిన్న నిబంధనల ఉల్లంఘనకు జైలు శిక్షలు, అరెస్టులు విధించే దారుణమైన నిబంధనలను ఎత్తివేయబోతున్నారు. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో అనవసర భయాందోళనలు సృష్టించకుండా సులభతర వ్యాపార వాతావరణాన్ని కల్పించడమే ఈ నూతన మార్పుల ముఖ్య ఉద్దేశం.