IndiGo: విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇంధన ఛార్జీలను భారీగా పెంచేసిన ఇండీగో
భారీగా పెంచేసిన ఇండీగో
IndiGo: పండుగల సీజన్ వేళ విమాన ప్రయాణం చేసే వారికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండీగో కోలుకోలేని షాక్ ఇచ్చింది. పెరిగిన విమాన ఇంధన (ATF) ధరల భారంతో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఫ్యూయల్ సర్ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఇంధన రుసుములు అక్టోబర్ 6, 2026 అర్ధరాత్రి నుంచి బుక్ చేసుకునే అన్ని కొత్త విమాన టికెట్లపై వర్తిస్తాయి. రాబోయే దసరా, దీపావళి పండుగల వేళ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ నిర్ణయంతో జేబులు ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎవియేషన్ ఫ్యూయల్ ధరల భారం
గత మూడు నెలలుగా విమాన ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. లీటరుకు రూ.121గా ఉన్న ఇంధన ధర అక్టోబర్ 1 నాటికి ఏకంగా 13.2 శాతం పెరిగి దాదాపు రూ.137కు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కలిపి మొత్తంగా 25 శాతానికి పైగా జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చే దాదాపు అత్యధిక భాగం ఆక్రమిస్తుందని, గత దశాబ్దంలోనే ఏటీఎఫ్ ధరలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో ఫ్యూయల్ ఛార్జీలు పెంచక తప్పలేదని ఇండీగో వెల్లడించింది.
దేశీయ రూట్లలో ఎంత పెరిగిందంటే?
దేశీయంగా ప్రయాణించే దూరాన్ని బట్టి ఫ్యూయల్ సర్ఛార్జీని రూ.375 నుంచి రూ.1,300 వరకు పెంచారు. 500 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి రూ.375, 501 నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.600, 1001 నుంచి 1500 కిలోమీటర్ల వరకు రూ.900 ఛార్జ్ చేయనున్నారు. అదేవిధంగా 1501 నుంచి 2000 కిలోమీటర్ల దూరానికి రూ.1,150, ఆపై ఉన్న ప్రయాణాలకు రూ.1,300 వరకు అదనంగా వసూలు చేస్తారు. ఏప్రిల్ నెలలో అమలు చేసిన రుసుములతో పోలిస్తే ఇది ప్రయాణికులపై గణనీయమైన భారం మోపనుంది.
అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియం
అంతర్జాతీయ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు కూడా మోత తప్పడం లేదు. గమ్యస్థానాన్ని బట్టి రూ.1,000 నుంచి ఏకంగా రూ.10,000 వరకు ఇంధన రుసుము విధించనున్నారు. సార్క్ దేశాలలోని 500 కిలోమీటర్ల లోపు రూట్లకు రూ.1,000, అంతకంటే ఎక్కువ దూరానికి రూ.3,000 ఛార్జ్ చేస్తారు. ఆగ్నేయాసియా, గల్ఫ్ (GCC), మధ్యప్రాచ్య, ఉత్తర, తూర్పు ఆసియా ప్రాంతాలకు రూ.5,500, ఆఫ్రికన్ దేశాలకు రూ.6,000, యూరప్ రూట్లకు ఏకంగా రూ.10,000 చొప్పున ఇంధన ఛార్జీలను నిర్ణయించారు.
ప్రయాణికులపై కనికరం చూపామంటున్న ఇండీగో
ఇంధన ధరల పెరుగుదలతో పోలిస్తే తాము పెంచిన రుసుములు చాలా తక్కువని ఇండీగో యాజమాన్యం పేర్కొంది. నిర్వహణ వ్యయం భారీగా పెరిగినప్పటికీ, ప్రయాణికులపై పడే భారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకే స్వల్పంగా ఛార్జీలను సర్దుబాటు చేశామని సమర్థించుకుంది. ఈదనంగా పడే భారం పట్ల విచారం వ్యక్తం చేస్తూనే, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణికులు దీనిని అర్థం చేసుకోవాలని కోరింది. రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.