Wedding Season: రాబోయే శీతాకాలంలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో హోటల్ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. హిందూ క్యాలెండర్ ప్రకారం నవంబర్, ఫిబ్రవరి నెలల్లో శుభ ముహూర్తాలు ఉన్నందున ప్రధాన వేదికలు, బ్యాంక్వెట్ హాళ్లు, హోటల్ గదులు నెలల ముందే బుక్ అయిపోతున్నాయి. లగ్న పత్రికలు చేతికి రాకముందే జనాలు ముందస్తు బుకింగ్స్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో వచ్చే ఏడాది వరకు కూడా పలు ప్రముఖ రిసార్టులలో గదులు దొరకడం గగనంగా మారింది.

డబుల్ డిజిట్ గ్రోత్‌తో జోరుగా వెడ్డింగ్ బిజినెస్

గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెళ్లిళ్ల బిజినెస్ దాదాపు 15 శాతం వరకు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. నూర్ మహల్ ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రతినిధులు వెల్లడించిన కథనం ప్రకారం.. వారి మొత్తం వ్యాపారంలో ఒక్క పెళ్లిళ్ల వాటానే 60 శాతంగా ఉంది. కేవలం ఈ ఏడాది శీతాకాలం కోసమే కాకుండా, 2027 లో జరగబోయే పెళ్లిళ్లకు కూడా ఇప్పటినుంచే విచారణలు, ముందస్తు బుకింగ్స్ రావడం విశేషం.

ట్రెండ్ మారింది.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ క్రేజ్

ప్రస్తుతం పెళ్లిళ్లు జరిపే శైలిలో మార్పులు వచ్చాయి. కుటుంబాలు కేవలం ఒక్క రోజుతో ముగించకుండా రెండు మూడు రోజుల పాటు సాగే ప్రత్యేక వేడుకలను కోరుకుంటున్నారు. తమకు నచ్చినట్లుగా కస్టమైజ్డ్ ఈవెంట్లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీలోని రోజియెట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‎లో నవంబర్ నెలకు సంబంధించిన బుకింగ్స్ దాదాపు పూర్తయ్యాయి. ఫిబ్రవరికి సంబంధించిన తేదీలు కూడా శరవేగంగా అమ్ముడవుతున్నాయి.

హోటల్ రంగానికి బిగ్ బూస్ట్

పెళ్లిళ్ల సీజన్ అనేది హోటల్ రంగానికి అత్యంత కీలకమైన సమయం. ఒక పెళ్లి వేడుక నిశ్చయమైతే రూమ్‌లు, హాల్స్, ఆహారం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలు అన్నీ ఒకేసారి బుక్ అవుతాయి. ముందస్తు బుకింగ్స్ పెరగడం వల్ల హోటల్ యాజమాన్యాలు కూడా రాబోయే సంవత్సరాల కోసం తమ వ్యాపార ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేసుకునే వెసులుబాటు లభిస్తోంది.

కస్టమర్లపై పెరిగిన అద్దెల భారం

విపరీతమైన డిమాండ్ కారణంగా హోటల్ గదులు, బ్యాంక్వెట్ హాళ్ల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఆఖరి నిమిషంలో వెన్యూస్ వెతుక్కునే వారికి లొకేషన్లు దొరకడం కష్టమవ్వడమే కాకుండా, అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. అందుకే చాలా కుటుంబాలు పెళ్లి తేదీ నిశ్చయమైన వెంటనే వేదికల బుకింగ్‌ను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Tags: