GST : మీరు వ్యాపారం చేస్తున్నారా? జిఎస్‌టి గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
జిఎస్‌టి గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
GST : చాలామంది చిన్న వ్యాపారులు, వ్యాపారస్తులకు ఒక సాధారణ సందేహం ఉంటుంది. అదేంటంటే.. GST (వస్తువులు, సేవల పన్ను) నమోదు చేసుకోవడం తప్పనిసరా? ఒకవేళ నమోదు చేసుకోవాలి అంటే దాని రూల్స్ ఏంటి ? ఎవరికి ఇది తప్పనిసరి అవుతుంది? కొన్నిసార్లు వ్యాపార లావాదేవీలు చిన్నవిగా ఉన్నా కూడా GST నమోదు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ నమోదు మీ వ్యాపారానికి చట్టబద్ధమైన గుర్తింపు, విశ్వసనీయతను తెస్తుంది. GST నమోదు గురించి మరిన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరికి తప్పనిసరి?
అన్ని వ్యాపారాలు GST కి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మీ వ్యాపారం ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది. అందుకు సంబంధించిన రూల్స్ ఇవే. మీ వ్యాపారం వస్తువుల అమ్మకం అయితే, సంవత్సరానికి రూ.40 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. మీ వ్యాపారం సేవల ద్వారా ఆదాయం పొందుతుంటే, సంవత్సరానికి రూ.20 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల వంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో వ్యాపారం చేసేవారికి ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వస్తువులను సరఫరా చేసే వ్యాపారాలకు, అలాగే ఆన్‌లైన్‌లో వస్తువులను అమ్మే ఈ-కామర్స్ వ్యాపారులకు, ఎగుమతి వ్యాపారాలకు టర్నోవర్ పరిమితితో సంబంధం లేకుండా జీఎస్టీ నమోదు తప్పనిసరి.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు
మీ వ్యాపార టర్నోవర్ తక్కువగా ఉన్నప్పటికీ జీఎస్టీ నమోదు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీఎస్టీ నమోదు చేసుకున్న వ్యాపారం చట్టబద్ధమైనది. విశ్వసనీయమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కస్టమర్లలో, ఇతర వ్యాపార భాగస్వాములలో మీ వ్యాపారంపై నమ్మకాన్ని పెంచుతుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపారాలు పెద్ద కంపెనీలతో సులభంగా లావాదేవీలు చేయగలవు, ఎందుకంటే అవి GSTని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం. మీరు మీ వ్యాపారం కోసం కొనుగోలు చేసే వస్తువులకు GST చెల్లిస్తే, మీరు చెల్లించిన ఆ పన్నును ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ద్వారా తిరిగి పొందవచ్చు. దీనివల్ల మీ ఖర్చు తగ్గుతుంది. వ్యాపార రుణాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపారాలకు ప్రాధాన్యత లభిస్తుంది.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. మీరు అధికారిక వెబ్‌సైట్ www.gst.gov.in లో ఆన్‌లైన్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. లేకపోతే, చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సహాయంతో కొంత రుసుము చెల్లించి కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం జీఎస్టీ నమోదుకు ఎటువంటి ఫీజు వసూలు చేయదు. ఆన్‌లైన్‌లో మీరు ఉచితంగానే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.