H-1B Visa Restrictions: హెచ్-1బీ వీసా ఆంక్షలు: అమెరికా కంపెనీలు భారత్ వైపు.. మరిన్ని జీసీసీలు రానున్నాయి!
మరిన్ని జీసీసీలు రానున్నాయి!
H-1B Visa Restrictions: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనల కారణంగా యూఎస్ కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను సవరించుకుంటున్నాయి. భారతీయ నిపుణులను హెచ్-1బీ వీసాల ద్వారా అమెరికాకు తీసుకురావడానికి బదులు, భారతదేశంలోనే కార్యాలయాలను స్థాపించాలని నిర్ణయించుకుంటున్నాయి. దీంతో మన దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విదేశీ కంపెనీలు ఇతర దేశాల్లో ఆర్థిక వ్యవహారాలు, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసే యూనిట్లను జీసీసీలు అంటారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌లో ప్రస్తుతం 1,700 జీసీసీలు పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలలో సగానికి మించి ఇక్కడే ఉన్నాయి. టెక్నాలజీ సపోర్ట్ సేవలు, లగ్జరీ కార్ల డాష్‌బోర్డ్ డిజైన్లు మొదలుకొని కొత్త ఔషధాల ఆవిష్కరణల వరకు భారత్ ఒక కీలక కేంద్రంగా మారింది. అనేక అమెరికా సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను భారత్‌కు మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని డెలాయిట్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోహన్ లోబో తెలిపారు.
ఈ జీసీసీల స్థాపన కోసం కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ప్రత్యేకించి ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన సంస్థలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి.