PAN Card : మీ పాన్ నంబర్‌తో ఎవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా తెలుసుకోండి!
ఇలా తెలుసుకోండి!;
PAN Card : ఎవరివైనా ఆధార్, పాన్ వివరాలు దొంగిలించబడి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మీ పాన్ నంబర్ ఉపయోగించి మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు తెరిచి, లోన్లు తీసుకోవడం వంటి మోసాలు జరగవచ్చు. దీనివల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు లేదా మీ క్రెడిట్ రేటింగ్ దెబ్బతినవచ్చు. భవిష్యత్తులో మీకు లోన్ కావాలంటే రాకపోవచ్చు. అందుకే, మీ పాన్ వివరాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. మీ పాన్ నంబర్‌ను మీ అనుమతి లేకుండా ఎవరైనా వాడుతున్నారో లేదో ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
మీ క్రెడిట్ రిపోర్ట్ పరిశీలిస్తే, మీ పాన్ నంబర్ కింద జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలు తెలుస్తాయి. మీ పాన్, మీ పేరు మీద తెరిచిన బ్యాంక్ అకౌంట్లు, లోన్‌లు, క్రెడిట్ కార్డులు వంటి అన్ని వివరాలు అందులో ఉంటాయి. కాబట్టి, క్రెడిట్ రిపోర్ట్‌ను తప్పకుండా చూస్తూ ఉండండి. భారతదేశంలో నాలుగు ప్రధాన క్రెడిట్ ఏజెన్సీలు ఉన్నాయి. సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్‌ఐఎఫ్ హైమార్క్.
ఈ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లలోకి వెళ్లి మీ రిపోర్ట్‌ను పొందవచ్చు. అలాగే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, బ్యాంక్ యాప్‌లు వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌లలో కూడా క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకునే అవకాశం ఉంది. మీ పాన్ నంబర్, మొబైల్ నంబర్ ఉపయోగించి క్రెడిట్ రిపోర్ట్‌ను పొందవచ్చు. ఒక ఏజెన్సీలో సంవత్సరానికి ఒకసారి ఉచితంగా రిపోర్ట్‌ను తీసుకోవచ్చు.
మీరు తీసుకున్న లోన్‌లు, క్రెడిట్ కార్డుల గురించి మీకు తెలుసు. అవి కాకుండా, మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఇతర ఏమైనా లోన్‌లు లేదా క్రెడిట్ కార్డులు ఉన్నాయా అని చూడండి. మీకు తెలియని బ్యాంక్ ఖాతాలు ఏమైనా ఉన్నాయా అని గమనించండి. అలాగే, మీ అనుమతి లేకుండా క్రెడిట్ బ్యూరోలకు ఎవరైనా సమాచారం పంపారా అని కూడా చెక్ చేయండి. ఒకవేళ ఇవేమైనా కనిపిస్తే, మీ పాన్ నంబర్‌ను వేరొకరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
మీ అనుమతి లేకుండా మీ పేరు మీద ఎవరైనా లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకున్నారని తెలిస్తే లోన్ ఇచ్చిన ఆర్థిక సంస్థలకు తెలియజేయండి. క్రెడిట్ బ్యూరోకు తెలియజేయండి. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు.