HDFC : ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్

కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్;

Update: 2025-08-13 09:14 GMT

HDFC : ప్రైవేట్ బ్యాంకుల్లో దేశంలోనే పెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐబ్యాంక్ బాటలోనే, ఇప్పుడు హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్లలో తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిన మినిమమ్ బ్యాలెన్స్‌ను భారీగా పెంచింది. ఇంతకు ముందు రూ.10,000గా ఉన్న ఈ లిమిట్ ఇప్పుడు రూ.25,000కు చేరింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2025 తర్వాత కొత్తగా అకౌంట్ తెరిచే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. పాత కస్టమర్లపై ప్రస్తుతానికి దీని ప్రభావం లేదు. ఈ కొత్త నిబంధనల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ నిబంధనల్లో చేసిన ఈ పెద్ద మార్పు ముఖ్యంగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచీలకు వర్తిస్తుంది. ఈ ప్రాంతాల్లో అకౌంట్ ఉన్న కస్టమర్లు తమ ఖాతాలో ఎల్లప్పుడూ కనీసం 25,000 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ బ్యాలెన్స్ ఈ లిమిట్ కంటే తక్కువగా ఉంటే, బ్యాంకు ప్రతి నెల ఛార్జీలను వసూలు చేస్తుంది. బ్యాంకింగ్ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇతర వ్యయాలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇంతకు ముందు పట్టణ ప్రాంతాల్లో మెయింటైన్ చేయాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ కేవలం రూ.10,000 మాత్రమే.

ఈ కొత్త నిబంధనలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. సెమీ-అర్బన్ బ్రాంచీల్లో కూడా మెయింటైన్ చేయాల్సిన బ్యాలెన్స్‌ను హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ పెంచింది. ఇంతకు ముందు ఇక్కడ రూ.5,000 ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు దీనిని కూడా రూ.25,000కు పెంచింది. ఇక గ్రామీణ బ్రాంచీల్లో అయితే, ఇంతకు ముందు రూ.5,000గా ఉన్న కనీస బ్యాలెన్స్‌ను ఇప్పుడు రూ.10,000కు పెంచింది. అయితే, జీరో-బ్యాలెన్స్ ఖాతాలైన శాలరీ అకౌంట్, BSBDA (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్)లకు ఈ కొత్త నిబంధనల నుండి మినహాయింపు లభించింది.

హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందే, మరో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇదే విధమైన మార్పులను ప్రకటించింది. ఆగస్టు 1, 2025 తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌లో కొత్తగా సేవింగ్స్ అకౌంట్ తెరిచే కస్టమర్లు కనీసం 50,000 రూపాయల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది పాత పరిమితి అయిన 10,000 రూపాయల కంటే చాలా ఎక్కువ. ప్రభుత్వ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను సడలించే ప్రయత్నంలో ఉన్న సమయంలో, ప్రైవేట్ బ్యాంకులు వాటిని కఠినతరం చేయడం గమనార్హం.

Tags:    

Similar News