Budget 2026: వైద్య రంగానికి మహర్దశ పట్టేనా? ఆసుపత్రుల పెంపు, స్థానిక తయారీపైనే హెల్త్‌కేర్ ఆశలు
ఆసుపత్రుల పెంపు, స్థానిక తయారీపైనే హెల్త్‌కేర్ ఆశలు
Budget 2026: భారత వైద్య రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, మౌలిక సదుపాయాల కొరత, విదేశీ దిగుమతులపై ఆధారపడటం ప్రధాన సమస్యలుగా మారాయి. ప్రస్తుతం మనం వాడుతున్న అత్యాధునిక వైద్య పరికరాలలో ఎక్కువ భాగం విదేశాల నుంచే వస్తున్నాయి. అమెరికా విధిస్తున్న కొత్త వాణిజ్య సుంకాలు భారత ఫార్మా ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా భారీగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని హెల్త్‌కేర్ పరిశ్రమ బడ్జెట్‌లో కోరుతోంది. తద్వారా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతను తీర్చవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వైద్య పరికరాల తయారీలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(PLI) పథకాన్ని మరింత విస్తరించాలని డిమాండ్ వినిపిస్తోంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంటుకి అధిక ప్రాధాన్యతనిస్తూ, వినూత్నమైన వైద్య సాంకేతికతను భారత్‌లోనే అభివృద్ధి చేసేలా ప్రోత్సాహకాలు అందించాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధర గల మందుల ఉత్పత్తి ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు అధిక విలువ కలిగిన బయో ఫార్మాస్యూటికల్స్, అడ్వాన్సుడ్ మందుల తయారీపై దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలు బడ్జెట్‌లో విజ్ఞప్తి చేస్తున్నాయి.
సామాన్యుడిపై పెరుగుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడం ఈ బడ్జెట్‌లో మరో ప్రధాన అజెండా కానుంది. వ్యక్తిగత ఆదాయపు పన్నులో ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇచ్చే మినహాయింపులను పెంచాలని, అలాగే బీమా పరిధిలోకి వచ్చే రోగాల సంఖ్యను కూడా పెంచాలని ప్రజలు ఆశిస్తున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే ఆరోగ్య సంరక్షణ పథకాలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా కార్పొరేట్ హెల్త్‌కేర్‌ను ప్రోత్సహించాలని పరిశ్రమ కోరుతోంది. పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం, పోషకాహార లోపాన్ని నివారించే పథకాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ కార్డులు ఇవ్వడం, టెలిమెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. అమెరికా వంటి దేశాల నుంచి ఎదురవుతున్న వాణిజ్య సవాళ్లను తట్టుకోవాలంటే, మన దేశీయ ఫార్మా రంగం ప్రపంచ స్థాయి క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను తక్కువ ధరకే అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తుందని యావత్ హెల్త్‌కేర్ రంగం ఆశాభావంతో ఎదురుచూస్తోంది.