GST Rates : భారీగా పెరగనున్న సెగరెట్, లగ్జరీ వస్తువులు..రాష్ట్రాలకు మరింత ఆదాయం

రాష్ట్రాలకు మరింత ఆదాయం;

Update: 2025-07-04 12:46 GMT

GST Rates : కొన్ని వస్తువులపై, ముఖ్యంగా సిగరెట్లపై పన్నులను మరింత పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. సిగరెట్లు, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఖరీదైన హై-ఎండ్ కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై జీఎస్టీ రేట్లను పెంచే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉందని ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదించింది. ప్రస్తుతం, ఈ సిగరెట్లు, ఇతర ఉత్పత్తులపై గరిష్టంగా 28% జీఎస్టీ రేటు ఉంది. దీనికి అదనంగా, కంపెన్సేషన్ సెస్ కూడా విధిస్తున్నారు. ఈ కంపెన్సేషన్ సెస్ రాష్ట్రాల మధ్య మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కంపెన్సేషన్ సెస్ స్థానంలో కొత్తగా 'హెల్త్ అండ్ గ్రీన్ సెస్'ను అమలు చేయవచ్చని తెలుస్తోంది. సిగరెట్లు, ఇతర హానికరమైన వస్తువులపై ఈ హెల్త్ సెస్ ను అధిక స్థాయిలో విధించవచ్చు.

కొత్త సెస్ ఎందుకు?

దేశంలో జీఎస్టీ విధానం అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయం తగ్గేది. దీనికి పరిహారంగా, 2017లో కంపెన్సేషన్ సెస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. శరీరానికి, పర్యావరణానికి హాని కలిగించే వస్తువులపై గరిష్ట జీఎస్టీతో పాటు కంపెన్సేషన్ సెస్ విధిస్తారు. ఈ సెస్ 2026 మార్చి 31న ముగుస్తుంది. దీని స్థానంలో కొత్త సెస్ తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది.

ఎక్కువ వస్తువులపై పన్ను తగ్గింపు?

ప్రభుత్వం జీఎస్టీ స్వరూపంలో కొన్ని మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థలో నాలుగు పన్ను స్లాబ్‌లు ఉన్నాయి: 5%, 12%, 18%, 28%. ఇందులో 12% స్లాబ్‌ను తొలగించే అవకాశం ఉంది. అంటే, 5%, 18%, 28% జీఎస్టీ రేట్లు మాత్రమే మిగులుతాయి. ప్రస్తుతం చాలా వస్తువులకు 5% స్లాబ్‌లో పన్ను ఉంది. 12% స్లాబ్‌లో ఉన్న చాలా వస్తువులను 5% స్లాబ్‌కు మార్చవచ్చు. మిగిలిన వాటిని 18% స్లాబ్‌కు తరలించవచ్చు. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు అమలులోకి వస్తే, కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉండగా, మరికొన్నింటి ధరలు తగ్గుతాయి

Tags:    

Similar News